పదేళ్ల క్రితమే మైత్రేయితో వివాహం

downloadకేంద్ర రైల్వే మంత్రి సదానంద కుమారుడు కార్తీక్ గౌడ, నటి మైత్రేయి వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. కార్తీక్ గౌడ తన భర్త అంటూ మైత్రేయి కొద్ది రోజుల క్రితం ఇక్కడి ఆర్టీ నగర  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే మంగళవారం కన్నడ సినీ దర్శకుడు రిషి మైత్రేయిపై ఇక్కడి 8వ ఏసీఎఎం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. పదేళ్ల క్రితమే తాను మైత్రేయిని వివాహం చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు రిషి, ఆయన న్యాయవాది కుమార గౌడ విలేకరులతో మాట్లాడుతూ… 2004లో కన్నడ సూర్య ది గ్రేట్ అనే సినిమాలో మైత్రేయి అలియాస్ శ్రుతి హీరోయిన్‌గా తానే అవకాశం కల్పించానని రిషి చెప్పారు. అదే ఏడాది జూలై 17న ఇక్కడి శేషాద్రిపురంలోని సన్మాన్ హోటల్లో మైత్రేయి తాను వివాహం చేసుకున్నట్లు రిషి చెప్పారు.

నాలుగు నెలల పాటు అదే లాడ్జిలో ఉన్నామని, కొద్ది రోజుల తరువాత తన వద్ద రూ. 2 లక్షలు నగదు తీసుకుని మైత్రేయి అదృశ్యమైందని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచి ఆమె కనిపించలేదని చెప్పారు. 2004 ఆగస్టు 27న మైత్రేయి ఉన్న ఇంటికి వెళ్తే తనను దూషించి బయటకు నెట్టి వేసిందని రిషి ఆరోపించారు. అదే రోజు ఒక నెంబర్ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని, దీంతో తాను   ఇక్కడి వయ్యాలికావెల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అదే విధంగా 2007లో కూడా వ్యాపారవేత్త అంజన్‌కుమార్ అనే వ్యక్తిని మైత్రేయి బ్లాక్ మెయిల్ చేసి నగదు వసూలు చేసిందని ఆరోపించారు.

అంతా అబద్ధం : నటి మైత్రేయి
సూర్య ది గ్రేట్ సినిమాలో నటించే సయయంలో తన వయస్సు 16 సంవత్సరాలు అని నటి మైత్రేయి చెప్పారు. మంగళవారం ఆమె ఒక టీవీ చానల్లో మాట్లాడుతూ… షూటింగ్ జరిగే ప్రతి రోజు తాను తల్లితో కలిసి వచ్చానని, అలాంటి సమయంలో తాను తల్లికి తెలియకుండా వివాహం ఎలా చేసుకుంటానని ప్రశ్నించారు. దర్శకుడు రిషి ఒక 420 అని అని మండిపడ్డారు. తాను కార్తీక్ గౌడపై కేసు పెట్టిన తరువాత ఈ ఆరోపణలు చెయ్యడం దారుణమని విలపించారు. కేసు దర్యాప్తులో అసలు విషయాలు వెలుగు చూస్తాయని మైత్రేయి స్పష్టం చేశారు.

కార్తీక్ కోసం ప్రత్యేక బృందాలు :
బుధవారం లోపు విచారణకు హాజరు కాకుంటే  కార్తీక్ అరెస్టు చెయ్యడానికి పోలీసు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా కార్తీక్ నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.