భారత అమ్మాయిల ఓటమి

imagesఇంచియాన్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో 28 ఏళ్ల తర్వాత పతకం ఖాయం చేసిన భారత అమ్మాయిలు.. కాంస్యంతో సరిపెట్టుకున్నారు. ఆదివారం మహిళల టీమ్ విభాగం సెమీఫైనల్లో భారత్ 1-3తో పటిష్ట దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. ప్రపంచ నెం.4 సంగ్ జిహ్యున్‌పై 21-12, 10-21, 21-9తో విజయం సాధించినా.. మిగతా క్రీడాకారిణులు విఫలమవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. 79 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన రెండో సింగిల్స్‌లో పి.వి.సింధు.. తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఆమె 14-21, 21-18, 13-21తో ప్రపంచ నెం.6 బే యియాన్‌జు చేతిలో పరాజయం పాలైంది. తర్వాత తొలి డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి- ప్రద్న్య గాద్రె 16-21, 17-21తో పోరాడి ఓడారు. దీంతో భారత్ 1-2తో వెనుకబడింది. మూడో సింగిల్స్‌లో పి.సి.తులసి 12-21, 18-21తో ఓడటంతో భారత్ ఆశలకు తెరపడింది. మరో సెమీస్‌లో చైనా చేతిలో 1-3తో ఓడిన జపాన్‌తో పాటు భారత్ కాంస్యం అందుకుంటుంది. స్వర్ణం కోసం చైనా, కొరియా తలపడతాయి. సెమీస్‌లో ఓడినా భారత అమ్మాయిలది చరిత్రాత్మక ప్రదర్శనే. 1986లో పురుషుల జట్టు కాంస్యం నెగ్గాక మళ్లీ భారత్‌కు ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో పతకం దక్కడమిదే తొలిసారి. ఈ చరిత్రాత్మక విజయంలో పాలుపంచుకున్న ఆరుగురిలో ముగ్గురు.. సైనా, సింధు, సిక్కిరెడ్డి హైదరాబాదీ క్రీడాకారులే. మిగతా ముగ్గురు.. అశ్విని, ప్రద్న్య, తులసి కూడా హైదరాబాద్‌లోనే సాధన చేస్తారు.

Leave a Comment