సినీ రంగంలో బలమైన బంధాలు

41405878314_625x300ప్రేమ – పెళ్లి. వీటికి మనిషి జీవితంలో దేని ప్రత్యేకత దానిదే. పెళ్లి లేనిదే కుటుంబం లేదు. ప్రేమ లేనిదే జీవితమే లేదు. మధురమైన జీవితానికి పెళ్లి బంధం వేస్తే ప్రేమ పెనవేసుకుంటుంది. ప్రేమ అనేది తొలుత ఆకర్షణతో మొదలయినా ఆ తరువాత అదే జీవిత గమ్యంగా మారుతుంది. ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోతే వారి జీవిత నౌక ఆనందమయంగా సాగుతుంది. అలాకాకుండా అపార్థాలతో తుంచేసుకుంటే జీవితంలో మిగిలేది వేదనే. ఇది జగమెరిగిన నగ్న సత్యం. అయినా కొందరి జీవితం అపోహలతో కలహాల కాపురంగా మారుతుంది.

ఇక్కడ ప్రేమ కీలకంగా మారుతుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న వారు కూడా ఒక్కోసారి విడిపోవాల్సి వస్తుంది. అలాగే పెద్దలు నిశ్చయించిన పెళ్లిళ్లు కలతలు లేకుండా సజావుగా సాగుతున్నాయనలేం. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం కూడా దాంపత్య జీవితంపై పడుతుంది. కారణాలేమయినా కావచ్చు లేదా అంతకు ముందు జరిగిన వదంతులు కావచ్చు. సినీ రంగంలో ఎన్నో విమర్శల మాటు నుంచి పుట్టిన ప్రేమకథలు ఎన్నో ఏళ్లుగా, ఎంతో బలంగా, హాయిగా సాగుతున్నాయి. వాటిలో కొన్ని గాథలు చూద్దాం.

 అన్యోన్యానికి మారుపేరు
అజిత్ – శాలిని దంపతులను అన్యోన్యానికి మారు పేరుగా పేర్కొనవచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా లవ్ ఎట్ ఫస్ట్ మూవీతోనే అజిత్ – శాలిని జీవితాన్ని కలిసి పంచుకోవాలని భావించారు.  అమర్కలం చిత్రం ఘన విజయం సాధించినట్లుగానే వీరి ప్రేమ 2000లో పెళ్లి పీటలెక్కింది. ఆ తరువాత శాలిని సినిమాలకు స్వస్తి పలికి సంసార జీవితమే లక్ష్యంగా అజిత్ అడుగులో అడుగేస్తూ సహధర్మచారిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజిత్‌కు శాలిని అంటే వల్లమానిన ప్రేమ. వీరి గారాల బిడ్డ పేరు అనౌష్క. భార్య శాలిని, కూతురు అనౌష్కనే అజిత్ ప్రపంచం. తన పనేమిటో తాను చేసుకుంటూపోయే అజిత్ జీవిత శైలి ప్రత్యేకం. తనకు సంబంధంలేని విషయాల గురించి అసలు స్పందించరు. సినిమా వేడుకలకు దూరంగా ఉంటారు. చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పవచ్చు. అజిత్, శాలిని అన్యోన్య జీవితానికి 15 వసంతాలు నిదర్శనంగా నిలిచాయి.

 ప్రేమకు నమ్మకం
సూర్య, జ్యోతికల జంట ప్రేమకు పెద్ద నమ్మకం. వీరిద్దరూ కలిసి చాలా చిత్రాల్లో నటించారు. అయితే వీరి ప్రేమకు భీజం పడింది మాత్రం కాక్కకాక్క చిత్రం షూటింగ్ సమయంలోనే. అంతకుముందు వరకు సూర్య వర్ధమాన నటుడు, సీనియర్ నటుడు శివకుమార్ కొడుకనే ఘనత ఉంది. అప్పట్లో జ్యోతిక, సూర్యకు సిఫార్సు చేసేవారనే ప్రచారం కూడా జరిగింది.

వీరి మధ్య పరిచయం స్నేహంగా మారి ఆపై ప్రేమగా మొగ్గుతొడిగి 2006లో పెళ్లికి దారి తీసింది. వివాహానంతరం జ్యోతిక నటనకు దూరమయ్యారు. అప్పటికే ఆమె నంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. అలాగే జోకి ఆసక్తి ఉంటే నటించడానికి తాను అడ్డు చెప్పనని సూర్య స్పష్టం చేశారు. జ్యోతిక అంటే సూర్యకు అమితమయిన ప్రేమ. ముద్దుగా జో అని పిలుచుకుంటారు. వీరి ప్రేమానుబంధాల కాలం 8 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదర్శ దంపతుల ప్రేమకు చిహ్నం దియా, దేవ్‌లు.

 ముచ్చటైన జంట
సినీ రంగంలో మరో ముచ్చటైన జంట ప్రసన్న – స్నేహ.  తమిళం, తెలుగు భాషల్లో నటిగా స్నేహ చక్కటి పేరు సంపాదించుకున్నారు. ప్రసన్న కూడా తమిళం, మలయాళంలో యువ నటుడిగా గుర్తింపు పొందారు. వీరి ప్రేమాయణం మూడేళ్లకు పైగా సాగింది. అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటిస్తుండగా ప్రసన్న – స్నేహల మధ్య ప్రేమ పుట్టింటారు. 2012 మేలో పెద్దల అనుమతితో వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ఆ తరువాత స్నేహ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.

ఇలా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, గాయని సైందవిల సుదీర్ఘ ప్రేమ ఫలించి పెళ్లి పీటలెక్కింది. అలాగే గాయని చిన్మయి, నటుడు రహల్‌ప్రేమ సమీపకాలంలో పరిణయంగా మారింది. నటి సంగీత, గాయకుడు క్రిష్‌లు ప్రేమించి పెళ్లి చేసుకునిహాయిగా జీవిస్తున్నారు. ఇంతకు ముందు తరంలో కూడా ప్రేమతో ఒకటైన సినీ ఆదర్శ దంపతులు చాలా మంది ఉన్నారు. వారి ప్రేమ చాలా బలమైంది, దృఢమైనది.

 మరపురాని జంట
కోలీవుడ్‌లో మరో మరపురాని ప్రేమ జంట మణిరత్నం, సుహాసిని. మణిరత్నం దర్శకుడిగా ఎంత ఖ్యాతి గాంచారో, సుహాసినీ నటిగా అంత పేరు పొందారు. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పక తప్పదు. ఆత్మ విశ్వాసం మెండు. తొలి రోజుల్లో చాయాగ్రహణంలో శిక్షణ పొందిన సుహాసిని ఆ తరువాత హీరోయిన్‌గా తెరపై వెలిగిపోయారు. అటుపై దర్శకురాలిగా తనలోని కళా తృష్ణను తీర్చుకున్నారు. 1988లోనే దర్శకుడు మణిరత్నం కరమాలను ప్రేమతో చేపట్టారు. వీరి అన్యోన్య దాంపత్యానికి కానుకగా నందన్‌ను చెప్పుకోవచ్చు.

 నిజమైన ప్రేమ
యువ నటుడు ధనుష్, రజనీకాంత్ పెద్దకుమార్తె ఐశ్వర్యల ప్రేమ – పెళ్లి విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళ ప్రేమ గురించి కథలు కథలుగా ప్రచారం చేశారు. నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురిని ప్రేమించడానికి  దమ్ముకావాలి. ధనుష్, ఐశ్వర్యల ప్రేమ నిజమైంది కాబట్టి సక్సెస్ య్యింది. 2004లో ఈ ప్రేమ జంట ఒకటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలే యాత్ర, లింగాలు. పసి హృదయాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెప్పలేని ప్రేమ.

Leave a Comment