కొలంబో: దిగ్గజ బ్యాట్స్‌మన్ మహేల జయవర్దనెకు బ్రహ్మాండమైన వీడ్కోలు! కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న మహేలకు చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం! పాకిస్థాన్‌పై రెండో టెస్టులో 105 పరుగుల తేడాతో గెలిచిన లంక సిరీస్‌ను 2-0తో నెగ్గి మహేలకు ఘనమైన వీడ్కోలు పలికింది. 272 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 127/7తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్.. హెరాత్ (5/57) మాయాజాలనికి 165 పరుగులకే ఆలౌటైంది. సర్ఫ్‌రాజ్ అహ్మద్ (55) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ చివరి బ్యాట్స్‌మన్ ఔట్ కాగానే జయవర్దనే భావోద్వేగానికి గురయ్యాడు. వేగంగా పెవిలియన్‌కు వెళ్లి తల్లిదండ్రులను కౌగించుకున్న మహేల… శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో కరచాలనం చేశాడు. జయవర్దనే తిరిగి రాగానే లంక ఆటగాళ్లు అతన్ని భుజాన మోస్తూ మైదానం మొత్తం తిప్పారు. కిక్కిరిసిన సింహలీస్ స్పోర్ట్స్ మైదానంలోని అభిమానులు అతనికి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలుపుతుండగా మహేల మైదానం నుంచి నిష్క్రమించాడు. మహేలకు కృతజ్ఞతలు తెలుపుతూ అభిమానులు భారీ బ్యానర్లతో స్టేడియాలకు రాగా… బాణసంచా మెరుపులతో స్టేడియం కళకళలాడింది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 320;
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 332;
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 282;
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 162
ఆపద్బాంధవుడి నిష్క్రమణ
మహేల జయవర్దనె శ్రీలంక క్రికెట్ జాతీయ హీరో! బ్యాట్స్‌మన్‌గా… ఫీల్డర్‌గా… సారథిగా లంకకు అతనో గొప్ప ఆదరవు. శ్రీలంక జట్టుకు ఆశ, శ్వాస. 17 ఏళ్లుగా లంకకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించిన మహేల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం ఆ జట్టుకు తీరని లోటు. సనత్ జయసూర్య, అరవింద డిసిల్వా, మహనామా, అర్జున రణతుంగ లాంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్న జట్టులో 1997లో 20 ఏళ్ల వయసులో తొలిసారి చోటు సంపాదించిన జయవర్దనె వేగంగా తనకుంటూ ఒక గుర్తింపు సంపాదించకున్నాడు. అద్భుతమైన టైమింగ్‌తో క్లాస్ బ్యాటింగ్ చేయడమే కాదు.. అవసరమైనపుడు దూకుడుగా ఆడటం జయవర్దనె ప్రత్యేకత. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో జయవర్దనెకు గొప్ప పేరుంది. 38 టెస్టుల్లో లంకకు సారథిగా వ్యవహరించిన మహేల 18 విజయాలందించాడు. జయవర్దనె లేని లోటు పూడ్చుకోవడం లంకకు అంత సులభమేమీ కాదు. అతను వన్డేల్లో కొనసాగడం ఒక్కటే అభిమానులకు వూరట. ఐతే అది కూడా ప్రపంచకప్ వరకే కావచ్చు.
”నిష్క్రమణ సమయంలో ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు. కానీ ఏడవను. నన్ను ఇంతగా ఆరాధించిన అభిమానులకు ఎంతో కృతజ్ఞతలు. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో పూర్తి సామర్థ్యంతో ఆడి జట్టుకు కప్ అందించడమే నా లక్ష్యం”
టెస్టులు: 149
పరుగులు: 11,814
అత్యధికం: 374
సగటు: 49.84
శతకాలు: 34
అర్ధశతకాలు: 50
Recent Comments