ధోనీకి కోపమొచ్చింది

images (5)హౖదరాబాద్: మహేంద్రసింగ్ ధోనీ.. భారత్‌కు రెండు ప్రపంచ కప్ (వన్డే, టీ20)లు అందించిన సారథి. తాను కోరుకున్నది క్షణాల్లో తెప్పించుకోగల సెలబ్రిటీ. అలాంటి ధోనీకి హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. తాను మనసుపడ్డ బిర్యానీని హోటల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. రెండు గంటలకు పైగా ఎదురుచూసేలా చేశారు! దీంతో మిస్టర్ కూల్ ధోనీకి కోపమొచ్చింది. హోటల్ సిబ్బంది వ్యవహారశైలితో విసిగిపోయిన ధోనీ.. తన కెరీర్‌లో తొలిసారిగా బస చేసిన హోటల్‌ను వీడాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో వివరాల్లోకి వెళితే..
ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా ఈనెల 15న చెన్నై సూపర్‌కింగ్స్ హైదరాబాద్‌కు వచ్చింది. బేగంపేటలోని ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్‌లో బస చేసింది. అదేసమయంలో అంబటి రాయుడు (ముంబయి ఇండియన్స్) రాయ్‌పూర్‌లో ఉన్నాడు. అయినా.. తన ఇంట్లో బిర్యానీ తయారు చేయించి ధోనీతో పాటు టీమ్ఇండియా సహచరులకు పంపించాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి 7 గంటలకు హోటల్‌కు బిర్యానీ వాహనం చేరుకుంది. ఐతే హోటల్ భద్రత సిబ్బంది బిర్యానీని గేటు లోపలికి అనుమతించకపోవడంతో వివాదం మొదలైంది. చెన్నై జట్టు మేనేజర్.. హోటల్ సిబ్బందితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. బిర్యానీ వచ్చి గంట దాటినా లోపలికి అనుమతించకపోవడంతో స్వయంగా ధోనీ కలగజేసుకున్నాడు. అప్పుడు వాహనాన్ని పార్కింగ్ ప్రాంతం వరకు అనుమతిచ్చారు. అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళేందుకు హోటల్ సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో ధోనీ, రైనా, జడేజా, మెక్‌కలమ్, బ్రావొ, స్మిత్‌తో సహా చెన్నై జట్టు సభ్యులంతా పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వాహనం దగ్గరికి వెళ్లి అక్కడే బిర్యానీ తినడం ఆరంభించారు. కంగుతిన్న హోటల్ సిబ్బంది.. ఆహారాన్ని లోపలికి అనుమతించారు. హోటల్ సిబ్బంది ప్రవర్తన ధోనీని మనస్తాపానికి గురిచేసింది. అంతే.. చెన్నై జట్టు మంగళవారం కాకతీయ హోటల్‌ను ఖాళీ చేసి.. తాజ్ కృష్ణా హోటల్‌కు మకాం మార్చింది. చెన్నైతో పాటు బీసీసీఐ అధికారులు కూడా హోటల్ మారారు. బుధవారం కాకతీయ హోటల్‌లో బస చేయాల్సిన ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ తాజ్ కృష్ణాలో దిగడం గమనార్హం. గురువారం చెన్నై జట్టు హైదరాబాద్‌ను వీడి బెంగళూరు వెళ్ళింది. ”మాది డీలక్స్ వసతులున్న ఫైవ్‌స్టార్ హోటల్. నగరంలో ఇలాంటి హోటళ్ళు ఐదున్నాయి. ఏ హోటల్ నచ్చితే అందులో ఉండొచ్చు” అని ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ జనరల్ మేనేజర్ గార్జ్ వర్గీస్ తెలిపాడు. ”హోటల్‌లో మాకు సౌకర్యంగా అనిపించలేదు. అందుకే అక్కడి నుంచి మారాం” అని చెన్నై ప్రతినిధి రసెల్ రాధాకృష్ణన్ చెప్పాడు.

Leave a Comment