రిటైరయ్యాక సైన్యంలో పని చేస్తా

downloadపపంచకప్ గెలవడం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అది చాలామందికి చాలా గొప్ప విషయం. మన దేశంలో నిలకడగా ఉండేదేదైనా ఉందంటే అది క్రికెట్టే. జనాల ముఖాల్లో సంతోషంతో నిండిపోయేలా చేయడాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఐతే వ్యక్తిగతంగా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకునేది, గర్వించేది సైన్యంలో చేరడమే. ఓసారి ఆర్మీ చీఫ్‌ను కలిసినపుడు సైన్యంలో చేరడంపై నాకున్న ఆసక్తిని వెల్లడించా. ఆయన అనేక మార్గాల్లో సిఫారసు చేసి.. చివరికి రాష్ట్రపతి వద్దకు దస్త్రం చేరాక అనుమతి లభించింది. నాకు గౌరవ లెఫ్టినెంట్ హోదా ఇచ్చారు. ఏ రెజిమెంట్ అయినా ఎంచుకునే అవకాశమున్నా.. నేను పారాచ్యూట్స్ తీసుకున్నా. ఇది చాలా ప్రత్యేకమైంది. చేయడానికి చాలా ఉంటుంది. భవిష్యత్తులో అక్కడ సైనికులతో కలిసి పనిచేస్తా. నిజమైన సైనికుడిలా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నా. 
సాక్షికి ఆ విషయం ముందే చెప్పా: నాకు దేశమంటే చాలా ఇష్టం. నా భార్యకు నా ప్రాధాన్యాలేంటో మొదట్లోనే చెప్పా. దేశం, తల్లిదండ్రులు.. ఆ తర్వాతే తనని స్పష్టంగా తెలియజేశా. భారత క్రికెటర్‌గా నా బాధ్యతలు నాకుంటాయి. క్రికెట్టే జీవితం కాదు. కానీ నేనిలా ఉండటంలో దాని పాత్రే ముఖ్యమైంది. కాబట్టి అన్ని ఫార్మాట్లలోనూ ఆడటానికి, సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆట కోసం కేటాయించడానికి ప్రయత్నిస్తా. ఆర్మీ కోసం కూడా కూడా పని చేయాలి. ఆటలో ఫలితం కంటే.. ఎలా ఆడామన్నది ముఖ్యం. అన్ని రకాలు సన్నద్ధమై.. మన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించినపుడు.. ఫలితం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం వంద శాతం దృష్టిపెట్టినపుడు.. క్యాచ్ చేజారినా బాధ పడాల్సిన పని లేదు. మనం మనసు పెట్టకుంటేనే సమస్య. నేను ఈ క్షణం కోసం బతుకుతా. గతం, భవిష్యత్తు గురించి పట్టింపు లేదు.

చేపలు నచ్చవు.. మద్యం ముట్టను: నా భార్య నన్నెప్పుడూ చేపలు తినమని, చాలా రుచికరంగా ఉంటాయని అంటుంది. కానీ నాకు చేపలు నచ్చవు. మద్యం రుచి చేదుగా ఉంటుంది. అందుకే తాగను. ఐతే దాన్ని కొందరు ఆస్వాదిస్తారన్న విషయం అర్థం చేసుకుంటా. జనాలు ఎలా జీవిస్తారో.. తమ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టుకుంటారో గమనిస్తుంటా. అమితాబ్, సచిన్, ద్రవిడ్‌లు నా హీరోలుగా ఎందుకు మారారో ఆలోచిస్తుంటా. నాకు యువ ప్రతిభావంతులంటే ఇష్టం. ఉదాహరణకు రహానె. తనను తనలాగే ఉండమని.. తన ప్రతిభను నమ్మి, తన పరిధిలోనే ఆడమని అడుగుతుంటా. లార్డ్స్‌లో అతనదే చేశాడు. సెంచరీ సాధించాడు. 

ఆ విషయం ద్రవిడ్‌ను చూసి నేర్చుకున్నా: మర్యాదపూర్వకంగా ‘లేదు’ అని చెప్పడమెలాగో ద్రవిడ్‌ను చూసి నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి అమ్మకూచిని. కానీ ఎదిగే వయసులో నాన్నను చూసి చాలా నేర్చుకున్నా. ఆయన నుంచి క్రమశిక్షణ అలవర్చుకున్నా. ఓసారి పరీక్ష రోజు ముందు పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. చదవాలా, మ్యాచ్‌కు వెళ్లాలా అని నాన్నను అడిగాను. పరీక్షకు సన్నద్ధంగా ఉన్నావా అని అడిగాడు. ఔనన్నా. పరీక్షకు ముందు సరదాగా వెళ్లి మ్యాచ్ ఆడు అన్నాడు. రైల్వేలో టీసీగా ఉద్యోగం తెచ్చుకోవడం నాకు మంచి అనుభవం. మాది మధ్య తరగతి కుటుంబం. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావడంతో చాలా సంతోషించా. ఆ ఉద్యోగాన్ని ఎంతో కోరుకున్నా. మంచి జీవితం వచ్చిందనుకున్నా. నాకది కొంత డబ్బు సంపాదించి పెట్టింది. కొన్ని అనుభవాలు మిగిల్చింది. క్రికెట్‌పై దృష్టిసారించేందుకు తోడ్పడింది.

ఫైనల్లో ఆ నిర్ణయం ఓ జూదం..: ప్రపంచకప్ ఫైనల్లో యువరాజ్ కన్నా ముందు బ్యాటింగ్‌కు వెళ్లడం అనుకోకుండా తీసుకున్న నిర్ణయం. నేను ముందు వెళ్లాలని నా అంతరాత్మ చెప్పింది. ప్యాడ్లు కట్టుకుంటుండగా.. గ్యారీ వచ్చి నా వైపు చూశాడు. నేను వెళ్లాలా అని అడిగాను. వెళ్లాలన్నాడు. ఐపీఎల్‌లో మురళీధరన్‌తో చాలా మ్యాచ్‌లాడాను. ఆ సమయంలో అతణ్ని సమర్థంగా ఎదుర్కోగలనని భావించాను. నా నిర్ణయం జూదం లాంటిది. అది తప్పా ఒప్పా అన్న చర్చే లేదు. అప్పటికి అది సరైన నిర్ణయమనిపించి వెళ్లాను. జట్టు నాపై నమ్మకముంచింది.మళ్లీ జులపాల జుట్టుతో కనిపించే అవకాశం లేదు. ప్రపంచకప్ కోసం భారీ ఆశలుండటంతో కొన్ని రోజుల పాటు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాం. ఫైనల్ తర్వాత ఒత్తిడికి సెలవిస్తూ గుండు చేయించుకున్నా. గ్యారీ కిర్‌స్టన్, డంకన్ ఫ్లెచర్‌లది భిన్నమైన శైలి. ఓ ఆటగాడి బలహీనతను గుర్తించి.. ఆ విషయం అతడికి తెలియకుండానే సరిదిద్దుతాడు గ్యారీ. డంకన్ ప్రొఫెషనల్‌గా లేకుంటే అస్సలు సహించడు. కానీ చాలా మంచి మనిషి. 

పిల్లలకు స్వేచ్ఛనిస్తా: తీరిక లేని క్రికెట్ ఆడుతున్నానని నాకు బాధ లేదు. సాక్షి నా జీవితానికి కావాల్సిన ఆనందాన్నిస్తోంది. జోకులేస్తూ నవ్వించడమే కాదు. ప్రేమగా ఉంటుంది. నాకు స్ఫూర్తినిస్తుంది కూడా.. ఇద్దరం కలిసి వివిధ ప్రదేశాలు చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు తన కంటే క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. నా పిల్లల్ని సరదాగా, స్వేచ్ఛగా, కొంచెం క్రమశిక్షణతో, ఎదుటివారిని గౌరవించేలా పెంచాలని అనుకుంటున్నా. క్రీడాకారులు కావాలనుకుంటే వాళ్లకిష్టమైన ఆట ఎంచుకోవచ్చు. 


చిన్ననాటి నుంచి నేను ఆయుధాల గురించి, యుద్ధ ట్యాంకుల గురించి చదువుకున్నా. సైన్యంలో చేరాలన్న ఆసక్తి ఉండేది. క్రికెటర్‌గా ఎదిగాక సైనికులతో గడిపే అవకాశం దక్కింది. భద్రత దళాల్లో నాకు కొందరు మిత్రులున్నారు. వాళ్ల జీవితాలెలా ఉంటాయో, వారి నిబద్ధత ఎలాంటిదో, ఎన్ని సాహసాలు చేస్తారో నాకు తెలుసు.
భవిష్యత్తులో సైనికులతో కలిసి పనిచేస్తా. నిజమైన సైనికుడిలా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు దేశమంటే చాలా ఇష్టం. నా భార్యకు నా ప్రాధాన్యాలేంటో మొదట్లోనే చెప్పా. దేశం, తల్లిదండ్రులు.. ఆ తర్వాతే తనని స్పష్టంగా తెలియజేశా. భారత క్రికెటర్‌గా నా బాధ్యతలు నాకుంటాయి. క్రికెట్టే జీవితం కాదు.
జట్టు మంచి స్థితిలో ఉన్నపుడు తప్పుకుంటా. అంతే తప్ప కష్టాల్లో ఉన్నపుడు కాదు. అలా అయితే మూడేళ్ల ముందు ఇంగ్లాండ్‌లో ఓడినప్పుడే బాధ్యతలు వదిలేయాలి. నా వేగం తగ్గిందన్న భావన వచ్చాక జట్టులో ఉండను. రిటైరయ్యాక అకాడమీలు పెట్టాలని.. కుర్రాళ్లకు మంచి వసతులు కల్పించాలని అనుకుంటున్నా.

Leave a Comment