విషమే ఔషధం!

81407968031_625x300పాము, తేలు, తేనెటీగ… వీటిలో మొదటి రెండంటే చాలామందికి హడల్. తేనెటీగ కూడా తియ్యటి తేనెనిచ్చినా.. పెద్దసంఖ్యలో వెంటబడి కుట్టాయంటే ప్రాణాలు పోవడం ఖాయం. అయితే.. వీటి విషం కేన్సర్ కణతులను అంతమొం దించేందుకు కూడా ఉపయోగపడుతుంద ని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త దీపాంజన్ పాన్. ఈ విషాలతో ప్రయోగాలు చేపట్టిన దీపాంజన్ బృందం ప్రయోగశాలలో ఛాతీ కేన్సర్, చర్మకేన్సర్ పెరుగుదలను విజయవంతంగా అడ్డుకోగలిగిందట. అయితే ప్రస్తుతం తమ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని దీపాంజన్ పేర్కొన్నారు.

కీమోథెరపీ మాదిరిగానే విషంతో కూడా కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యకరమైన కణాలకూ హాని కలుగుతుందని, అందువల్ల విషంలోని కొన్ని ప్రొటీన్లు, పెప్టైడ్లను తొలగించి చికిత్స చేస్తే.. కేన్సర్ కణాలను మాత్రమే అంతమొందించవచ్చని ఆయన చెబుతున్నారు. కాగా, విషంతో వ్యాధులకు చికిత్స అనేది పురాతన కాలం నుంచీ ఉన్నట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దానికి చెందిన గ్రీకు రచయిత ప్లీనీ ద ఎల్డర్ బట్టతలకు తేనెటీగ విషం వినియోగం గురించి ఓ పుస్తకంలో రాశారు. అలాగే కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమ కేన్సర్లకు తమ పురాతన వైద్యంలో కప్ప విషాన్ని వాడినట్లూ చైనీయులు చెబుతారు.