డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం పూర్తి

Metro tunnel routeరాష్ట్ర మంత్రి  రామలింగారెడ్డి వెల్లడి
సాక్షి, బెంగళూరు : కబ్బన్ పార్క్ నుంచి మహాత్మాగాంధీ రోడ్ (ఎం.జీ రోడ్) వరకు నిర్మిస్తున్న మెట్రో సొరంగ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం నిర్మాణం పూర్తవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. శనివారమిక్కడ మెట్రో రైలు అధికారులతో కలిసి సొరంగ మార్గం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రో సొరంగ మార్గం నిర్మాణంలో ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ట్రాక్ వేసే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు.

డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తికానున్నాయని, ఏప్రిల్ లేదా మే నెలలో సొరంగ మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ రోడ్ నుంచి బయ్యప్పన హళ్లి, మల్లేశ్వరం నుంచి పీణ్యా మెట్రో రైలు మార్గాలు అందుబాటులోకి రావడంతో వేలాది మంది నగరవాసులకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇక రెండో విడతలోని మెట్రో రైలు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భూ స్వాధీన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యే హ్యారిస్ తదితరులు పాల్గొన్నారు.  

Leave a Comment