గరిష్టంగా రూ. కోటి

61406057306_625x300ఐఎస్‌ఎల్‌లో స్టార్ ఆటగాడికి దక్కేది ఇంతే
తొలి రోజు 42 మందిని తీసుకున్న ఫ్రాంచైజీలు
నేడూ కొనసాగనున్న ఆటగాళ్ల ఎంపిక

 
 ముంబై: రిలయన్స్, ఐఎంజీ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భారత్‌లో స్టార్ అనుకున్న ఆటగాడికి గరిష్టంగా కోటి రూపాయలు దక్కనున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో దేశవాళీ ఆటగాళ్లకు కనిష్టంగా ఒక సీజన్‌కు రూ. 15 లక్షలు చెల్లించనున్నారు. ఈ టోర్నీలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు వేలం పాట లేకపోవడంతో వారికి ఇంతకుమించి దక్కే అవకాశం లేదు.
 
 ఐఎస్‌ఎల్ ద్వారా ఆటగాళ్లకు కనకవర్షం కురుస్తుందని ఆశించామని.. అయితే తక్కువ మొత్తంలోనే వారికి డబ్బు వస్తోందని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైఛుంగ్ భూటియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘లీగ్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టాలి. కానీ ఐఎస్‌ఎల్ ద్వారా ఆటగాళ్లకు తక్కువ మొత్తంలోనే డబ్బులు ముట్టబోతున్నాయి. ఇది నన్ను చాలా అసంతృప్తికి గురి చేస్తోంది. వేలం ఉండి ఉంటే ఆటగాళ్లకు మరిన్ని డబ్బులు దక్కేవేమో’ అని భూటియా అన్నాడు.
 
 డ్రాఫ్ట్ ద్వారా..: ముంబైలోని ఓ హోటల్‌లో మొదలైన రెండు రోజుల ఐఎస్‌ఎల్ దేశవాళీ ఆటగాళ్ల ఎంపికలో తొలి రోజు ఫ్రాంచైజీలు 42 మంది ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. భారత ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ సుబ్రతా పాల్, మిడ్‌ఫీల్డర్ సయ్యద్ రహీమ్ ముంబై ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ స్టార్ ఆటగాళ్లతో ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. డిఫెండర్లు నిర్మల్ ఛత్రి, గౌరమంగి సింగ్‌లను కేరళ బ్లాస్టర్స్, బెంగళూరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.
 
  తొలి రోజు మొత్తం 42 మంది దేశవాళీ ప్లేయర్లు ఏడు డ్రాఫ్ట్‌ల్లో ఉండగా.. అందులో 32 మంది గత మూడేళ్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారే. ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లలో జువెల్ రాజా (గోవా), జోమింగ్‌లియానా రాల్టే (నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్.సి), ధర్మరాజ్ రావణన్(పుణె), లెన్నీ ఫెర్నాండెజ్ (పుణె), లెన్నీ రోడ్రిగ్వెజ్ (పుణె), ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్ (ఢిల్లీ), మెహతాబ్ హుస్సేన్ (కేరళ) ఉన్నారు.
 
 ఇక గోవా, నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్‌లు ఇదివరకే కొందరు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.  మిగిలిన 42 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు నేడు ఎంపిక చేసుకోనున్నాయి. మొత్తం 14 డ్రాఫ్ట్‌ల్లోని 84 మంది ఆటగాళ్లలో 27 మంది ఫార్వర్డ్‌లు, వింగర్లు, 21 మంది మిడ్‌ఫీల్డర్లు, 26 మంది డిఫెండర్లు, 10 మంది గోల్ కీపర్లు ఉన్నారు.
 
 ఆగస్టులో విదేశీ ఆటగాళ్ల ఎంపిక: విదేశీ ప్లేయర్ల ఎంపిక వచ్చే నెల్లో జరగనుంది. దక్షిణ అమెరికా, యూరోప్‌లకు చెందిన 49 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు డ్రాఫ్ట్ ద్వారా ఎంపిక చేసుకుంటాయి.

Leave a Comment