అరుణగ్రహంపై రెండేళ్లు…

81407449527_625x300అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న నాసా క్యూరియాసిటీ రోవర్  మంగళవారం నాటికి మార్స్‌పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. రోదసిలో దాదాపు 9 నెలలు ప్రయాణించి ఆగస్టు 5, 2012న మార్స్‌పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో వాలిపోయిన క్యూరియాసిటీ ఈ రెండేళ్లలో ఆ గ్ర హం గురించి ఎన్నో వివరాలను భూమి కి పంపింది. అంగారకుడి మట్టి, శిలలపై లేజర్‌లను ప్రయోగించి వాటిలోని ఖనిజాలు, రసాయనాల వివరాలు సేకరించింది. ఒకప్పుడు అక్కడ సూక్ష్మజీవుల ఉనికికి అనుకూలమైన వాతావరణం ఉండేదా? అన్న కోణంలో పరిశోధించింది.

ఎల్లోనైఫ్ బే అనే ప్రాంతంలో గతంలో నీరు పెద్ద ఎత్తున ప్రవహించిందని గుర్తించింది. అక్కడ ఒకప్పుడు ఉన్న మంచినీటి సరస్సు ఆనవాళ్లనూ కనుగొంది. గేల్‌క్రేటర్ మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ షార్ప్ పర్వతం దిశగా సాగుతున్న రోవర్ మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోనుంది. అయితే మౌంట్ షార్ప్‌కు చెందిన పర్వతపాదం 500 మీటర్ల దూరంలోనే ఉందని, క్యూరియాసిటీ అక్కడికి చేరితే చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.