నా జీవితం అసంపూర్తిగా ఉంది: ప్రియాంక

images (2)మిస్ వరల్డ్గా గ్లామర్ ప్రపంచంలో వెలుగుచూసిన అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా.. నటనలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరిగా ఎదిగారు. అయినా తన జీవితం అసంపూర్తిగా ఉందని ప్రియాంక చెబుతోంది. దీనికి కారణం తండ్రి లేని లోటేనని అన్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా రిటైరయిన ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా ఆమె కెరీర్ ఉన్నతికి ఎంతో కృషి చేశారు. కేన్సర్ బారిన పడ్డ అశోక్ గతేడాది మరణించారు. శనివారం ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా తొలి జయంతి. ఈ సందర్భంగా ఆమె తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.

‘కొన్ని సార్లు ఎక్కువగా మాట్లాడుతుంటాను. ఈ రోజు మాత్రం మౌనంగా ఉండాలనిపిస్తోంది. నాన్నా నీవు లేనందుకు నా జీవితం ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. ఈ రోజు నా మనస్సులో అన్నీ నీ జ్ఞాపకాలు, ఆలోచనలే. ఏదో వెలితిగా ఉన్నట్టుంది. హ్యాపీ బర్త్డ్డ్డే నాన్నా’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.