నగరంలో మృగాళ్లు

download (4)నారపల్లిలో వివాహితపై సామూహిక అత్యాచారం
 
హైదరాబాద్: పహాడీషరీఫ్‌లో స్నేక్ గ్యాంగ్ పాల్పడిన దారుణ ఉదంతాన్ని మరిచిపోక ముందే మరో అకృత్యం చోటుచేసుకుంది. ఉపాధి కోసం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నగరానికి వచ్చిన ఓ అమాయక గిరిజన వివాహితపై ఐదుగురు వ్యక్తులు అత్యంత  కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వెంట ఉన్న భర్త, మరిదిలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి ఈ  అకృత్యానికి ఒడిగట్టారు. రాత్రింబవళ్లు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్-వరంగల్ హైవేకు సమీపంలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నారపల్లిని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ  ఉదంతం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎల్లంకి రవికిరణ్‌రెడ్డి కథనం ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన వివాహిత(21), ఆమె భర్త, మరిది కూలీ పని కోసం తమ పొరుగు గ్రామానికి చెందిన శ్రీనివాస్ సహకారంతో భువనగిరికి వచ్చారు. శ్రీనివాస్ వారం రోజుల క్రితం ఈ ముగ్గురుతోపాటు మరో నలుగురిని నగరంలోని ఉప్పల్‌కి తీసుకొచ్చాడు. ఏడుగురిని భువనగిరికి చెందిన బాలస్వామి అనే కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిర్చాడు. మంగళవారం భువనగిరిలో పనిలో చేరాల్సి ఉండడంతో, సోమవారం నలుగురు వెళ్లిపోయారు.

మిగిలిన ముగ్గురు సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక ఆటోలో భువనగిరికి బయలుదేరారు.  ఉప్పల్‌లో వీరి కదలికలను గమనిస్తున్న ఐదుగురు వ్యక్తులు ఆటోను వెంబడించినట్లు సమాచారం. నారపల్లికి చేరుకోగానే ఆ ఐదుగురు ఆటోను చుట్టుముట్టారు. ఆటోలో ఉన్న ముగ్గురిని బయటకు లాగారు. మరో ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్లాక, భర్త, మరిదిని రోడ్డు పక్కకు తోసేశారు. అంతేగాక తీవ్రంగా భయపెట్టారు. యువతిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఐదుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. సంఘటన స్థలం నుంచి తిరిగి వచ్చిన ఆ యువతి తమ భర్త, మరిది ఉన్న స్థలానికి చేరుకుంది. జరిగిన దారుణాన్ని భర్త, మరిదిల సహాయంతో బోరున విలపిస్తూ స్థానికులకు చెప్పింది. దీంతో వారు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన మేడిపల్లి పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.