నరేంద్ర మోడీకి తల్లి ఆశీస్సులు

downloadపుట్టినరోజున అమ్మ ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం గాంధీనగర్‌కు వెళ్లారు. ఎలాంటి భద్రతాసిబ్బంది, మందీమార్బలం లేకుండా ఒక్కరే వెళ్లి అమ్మ హీరాబెన్(95)కు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. మోడీ బుధవారం 64వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఏటా తల్లి వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకు అలవాటు. ప్రధానిగా రావడం ఇదే తొలిసారి. తల్లి చెంతనే ఆయన 15 నిముషాల పాటు గడిపారు. కుమారుడిని మనసారా ఆశీర్వదించిన హీరాబెన్ ఆయనకు మిఠాయిలు తినిపించారు. జమ్ము-కాశ్మీరు వరదబాధితుల సహాయార్థం రూ.5వేలను ప్రధాని సహాయనిధికి ఆమె అందచేశారు. కుమారుడి చెంత కూచుని ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తరఫున భారత్‌లో చైనా రాయబారి లీ యుషెంగ్ గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో మోడీని కలుసుకుని శుభాకాంక్షలు అందచేశారు. జపాన్ ప్రధాని కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి తదితరులు మోడీకి శుభాకాంక్షలు అందచేశారు. గుజరాత్ సీఎం ఆనందిబెన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో మోడీ తల్లి హీరాబెన్‌కు వందనాలు తెలిపారు. దేశం గర్వించే అద్భుత నేతను అందించిన మాతృమూర్తికి ప్రణామాలని పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షనేత విజయకాంత్, ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో తదితరులు మోడీకి శుభాకాంక్షలు తెలియచేశారు.

Leave a Comment