సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా..

41405368809_625x300* నేటి నుంచి ‘బ్రిక్స్’ సదస్సు.. బ్రెజిల్‌కు చేరుకున్న మోడీ
* ప్రపంచస్థాయి సదస్సులో తొలిసారిగా పాల్గొననున్న ప్రధాని

 
 ఫోర్టాలెజా(బ్రెజిల్): ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భాగమైన ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా నగరానికి చేరుకున్నారు. ‘బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా’లతో కూడిన ఈ కూటమి ఆరో సమావేశాలు మంగళ, బుధవారాల్లో జరుగుతున్నాయి. ‘సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి’ ఎజెండాతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రత్యేక అభివృద్ధి బ్యాంకు, ఆగంతుక నిధి ఏర్పాటు, ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలపై చర్చించనున్నారు. తొలుత ఢిల్లీ నుంచి బయలుదేరిన మోడీ.. ఆదివారం రాత్రి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం బ్రెజిల్‌లో సదస్సు నిర్వహిస్తున్న ఫోర్టాలెజా పట్టణానికి చేరుకున్నారు.
 
 అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుపైనే.. ఈ సారి ‘బ్రిక్’ సమావేశాల్లో ముఖ్యంగా రూ. 6 లక్షల కోట్లతో ‘బ్రిక్స్’ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు, ఆగంతుక నిధి ఏర్పాటుపై చర్చలు జరుగనున్నాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి సభ్య దేశాల్లో ఎవరెవరు ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలా? ఐదు దేశాలూ సమానంగా కేటాయించాలా? అన్నదానిపై ఇంతకు ముందటి భేటీలో చర్చించినా నిర్ణయానికి రాలేదు. భారత్ మాత్రం అన్ని దేశాలూ సమానంగా నిధులను ఇవ్వాలంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను చేపట్టాలనే డిమాండ్‌తోనూ ‘బ్రిక్స్’ సమావేశాల్లో చర్చించనున్నారు.
 
 ప్రపంచ స్థాయి నేతలతో
 తొలిసారిగా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. నరేంద్ర మోడీకి ఎక్కువ మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఈ సదస్సు ద్వారా లభిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ జుమా, బ్రెజిల్ అధినేత దిల్మా రోస్సెఫ్‌లతో మోడీ సమావేశం అవుతారు. అనంతరం బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో పలు లాటిన్ అమెరికా దేశాల అధినేతలతో భేటీ కానున్నారు.

Leave a Comment