మాకు సమ్మతం కాదు

download (1)ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన మధ్య సీట్ల పంపకంపై పీటముడి వీడలేదు. భాజపాకు 119 సీట్లు కేటాయిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. దీనికి కమలనాథులు ససేమిరా అన్నారు. ఆదివారమిక్కడ శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన శిబిరంలో థాకరే మాట్లాడారు. తాము 151 స్థానాల్లో పోటీ చేస్తామని, భాజపాకు 119 సీట్లు, ఇతరులకు 18 స్థానాలు కేటాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇదే ఆఖరు ఫార్ములా అని స్పష్టంచేశారు. తదుపరి నిర్ణయం భాజపాదేనన్నారు. ఆ పార్టీతో మైత్రిని కొనసాగించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఓం మాథూర్, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదించిన 135-135 ఫార్ములాను తిరస్కరించానని తెలిపారు. వచ్చే నెల కాషాయ జెండా నీడలో దీపావళి పండగను జరుపుకొంటామన్నారు. అభ్యర్థుల జాబితా తయారైందని, ఏ క్షణమైనా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మరోపక్క ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేనతో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకున్న మార్గాలపై చర్చించారు. 119 సీట్లు ఇస్తామన్న శివసేన ప్రతిపాదనను భాజపా తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడానికి సిద్ధమని సంకేతాలిచ్చినట్లు వివరించాయి. మహారాష్ట్రపై ఏర్పాటైన భాజపా కోర్ బృందం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై చర్చించింది. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లను శివసేన ఇవ్వకుంటే ఒంటరి పోరు వైపు మొగ్గు చూపాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సోమవారం ముంబయిలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరగనుందనీ….సీట్ల సర్దుబాటు అంశంపై అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటామని ఎన్సీపీ సీనియర్‌నేత ప్రఫూల్ పటేల్ ఆదివారం నాడిక్కడ పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఎన్సీపీ కనుక సీట్ల సంఖ్య విషయంలో పట్టూవిడుపూ లేకుండా అలాగే ఉంటే కష్టమని స్పష్టం చేసింది. తమ మిత్రపక్షమైన ఎన్సీపీకి కొన్ని సీట్లివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ…సంఖ్య విషయంలో పట్టుపడితే కష్టమేననీ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మానిక్‌రావు థాక్రే తెలిపారు. ఏఐసీసీ పరిశీలనా సంఘం సారథి(మహారాష్ట్ర వ్యవహారాలు) మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఆదివారం మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా సమావేశమైనారు.

Leave a Comment