నిషికోరి సంచలనం

download (1)జపాన్ ఆటగాడు కి నిషికోరి చరిత్ర సృష్టించాడు. 96 ఏళ్ల తర్వాత యుఎస్ ఓపెన్ సెమీఫైనల్ చేరిన జపాన్ క్రీడాకారుడిగా రికార్డు సాధించాడు. ప్రపంచ నెం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మహిళల నెం.1 సెరెనా విలియమ్స్ కూడా సెమీఫైనల్లో ప్రవేశించారు. 
యుఎస్ ఓపెన్‌లో నిషికోరి వరుసగా రెండో మారథాన్ పోరులో గెలిచాడు. 4 గంటల 15 నిమిషాల పాటు సాగిన క్వార్టర్‌ఫైనల్లో పదో సీడ్ నిషికోరి 3-6, 7-5, 7-6 (9/7), 6-7 (5/7), 6-4తో మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)కు షాకిచ్చాడు. ఈ టోర్నీలో అతడు 4 గంటలకుపైగా మ్యాచ్ ఆడడం ఇది వరుసగా రెండోసారి. ప్రిక్వార్టర్‌ఫైనల్లో 4 గంటల 19 నిమిషాలసేపు పోరాడి మిలోస్ రోనిచ్ (కెనడా)ను ఓడించాడు. జపాన్ నుంచి చివరగా 1918 యుఎస్ ఛాంపియన్‌షిప్‌లో ఇచియా కుమాగె సెమీస్ చేరాడు. నిషికోరి సెమీస్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఢీకొంటాడు. 
జకోవిచ్ ఎనిమిదోసారి..: జకోవిచ్ వరుసగా ఎనిమిదోసారి యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించాడు. క్వార్టర్స్‌లో జకో 7-6 (7/1), 6-7 (1/7), 6-2, 6-4తో ఎనిమిదో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించాడు. ప్రతి పాయింటు కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించడంతో తొలి రెండు సెట్లకు రెండు గంటల సమయం పట్టింది. 2012 ఫైనల్లో 4 గంటల 54 నిమిషాలు పోరాడిన ఈ ఇద్దరు కొత్త రికార్డు సృష్టిస్తారేమో అనిపించింది. ఐతే తర్వాతి రెండు సెట్లలో జకోవిచ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. 

ఎదురులేని సెరెనా..: మహిళల విభాగంలో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ ప్రపంచ నెం.1 సెరెనా విలియమ్స్ హవా కొనసాగుతోంది. ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో సెరెనా 6-3, 6-2తో 11వ సీడ్ ఫ్లావియా పెనెట్టాను ఓడించింది. ఆరంభంలో అనవసర తప్పిదాలు చేసిన సెరెనా తొలి రెండు సర్వీస్‌లను ప్రత్యర్థికి కోల్పోయింది. 3-0తో ఆధిక్యంలో ఉన్న పెనెట్టా ఆ తర్వాత తొలి సెట్‌లో ఒక్క గేమ్ కూడా గెలవలేదు. రెండో సెట్లో రెండుసార్లు పెనెట్టా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయం సాధించింది. గత మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెరెనా కనీసం క్వార్టర్‌ఫైనల్‌కు కూడా చేరుకోలేదు. ఈ ఏడాది తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్ చేరినందుకు సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం సెరెనా చెప్పింది.

Leave a Comment