తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నితిన్ నాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ, జి. రవికుమార్, అనిల్ త్రెహాన్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ఆరంభమైంది. జి. రవికుమార్ దర్శకుడు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, యాక్షన్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. దేశం కోసం ఓ యువకుడు ఏం చేశాడు? అనేది చిత్రకథ.
ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ప్రేమకథ. 70 శాతం షూటింగ్ ముంబయ్‌లో జరుపుతాం. అలాగే, కొన్ని కీలక సన్నివేశాలను కాశ్మీర్‌లో చిత్రీకరిస్తాం. ఓ కీలక పాత్రను మురళీమోహన్‌గారు చేస్తున్నారు. ఇదే పాత్రకు హిందీలో అమితాబ్ బచ్చన్‌గార్ని అడగాలనుకుంటున్నాం. ప్రముఖ నిర్మాత ఎ.యం. రత్నం రాసిన పాటలు, కబీర్‌లాల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయి’’ అని చెప్పారు. రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని కబీర్‌లాల్ అన్నారు. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందని నితిన్ నాష్ చెప్పారు.
Recent Comments