మా విధానంలో మార్పులేదు: సుష్మ

61405978197_625x300గాజా హింసాకాండపై తీర్మానం కుదరదన్న ప్రభుత్వం
 
న్యూఢిల్లీ: పాలస్తీనా అంశంపై ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పూ లేదని, గాజా ప్రాంతంలో  సంఘర్షణపై ఎవరిపక్షమూ వహించబోమని ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో స్పష్టంచేసింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో పరిస్థితిపై తీర్మానం చేయాలన్న ప్రతిపక్షం డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది.  గాజా పరిస్థితిపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమాధానమిస్తూ, గాజా సమస్యపై సభలో రెండురకాల అభిప్రాయాలు ఉండరాదని, హింసాకాండ ఎక్కడ తలెత్తినా ఖండిస్తున్నామనే ఉమ్మడి సందేశాన్ని పంపించాలని సూచించారు. శాంతిచర్చలపై ఈజిప్ట్ చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్, పాలస్తీనా ఆమోదించాలని ఆమె అభిప్రాయపడ్డారు. అంతకు ముందు సభలో చర్చ సందర్భంగా,. గాజాలో హింసాకాండను ప్రతిపక్ష సభ్యులు ఖండించారు. గాజాపై తీర్మానాన్ని ఆమోదించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌నుంచి సైనిక కొనుగోళ్లను ప్రభుత్వం ర ద్దుచేసుకోవాలని, గాజా సమస్యను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించాలని కూడా డిమాండ్ చేశారు. 176వ నిబంధనకింద జరిగే చర్చకు సంబంధించి, సభలో తీర్మానం ఆమోదం సాధ్యంకాదని, సభలో ఏకాభిప్రాయంలేనపుడు తాను చేయగలిగిందేమీలేదని రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ స్పష్టంచేశారు.

ఆగని భీకర పోరాటం

గాజాలో, ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య రెండు వారులుగా సాగుతున్న భీకర పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో బాంబుల వర్షం కురిపించడ ంతోపాటు, హమాస్ మిలిటెంట్ల చొరబాటు యత్నాలను కూడా వమ్ముచేసింది. 14రోజుల పోరాటంలో ఇప్పటివరకూ 535మంది పాలస్తీనియన్లు, 18మంది సైనికులు సహా 20మంది ఇజ్రాయెలీలు మరణించారు. దాడుల్లో 3,100పాలస్తీనియన్లు గాయపడ్డారు. మరో వైపు,.తాజా పరిస్థితుల నేపథ్యంలో తక్షణం కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి, అమెరికా పిలుపునిచ్చాయి.

Leave a Comment