ఇక ‘రెగ్యులర్’

Civilian workers– నగర, పురసభల్లో రెగ్యులర్ కార్మికుల నియామకం : సీఎం
బెంగళూరు:  నగర, పురసభల్లో రెగ్యులర్ ప్రతిపాదికన పౌరకార్మికులను నియమిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఆ నియామకాల్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న పౌరకార్మికులకు ప్రధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. బెంగళూరులోని మల్లేశ్వరం ఆటమైదానంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర పౌరకార్మికుల బృహత్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ద్వారా పౌరకార్మికులను కాంట్రాక్ట్ పద్ధతి తీసుకుని వారితో పనులు చేయిస్తున్న ఎజెన్సీ సంస్థలు లాభపడుతున్నాయన్నారు.

దీని వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు పౌరకార్మికులకు ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ పౌరకార్మికులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందన్నారు. అందువల్ల ఇకపై పౌరకార్మికులను రెగ్యులర్ ప్రతిపాదికనే ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని నగర, పురసభల్లో దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ మాట్లాడుతూ .. పౌరకార్మికుల సంక్షేమం కోసం కాళప్ప నివేదికలోని సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్ట్ పద్ధతిన పౌరకార్మికుల నియామకాలను చేపట్టకూడదని ప్రభుత్వానికి సూచించారు.చాలా ఏళ్లుగా పౌరకార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న వెయ్యి మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించుకోవడానికి ఇటీవల జరిగిన మంత్రి మండలిలో ఆమోదం లభించిందని కార్యక్రమంలో పాల్గొన్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్‌సూరకే తెలిపారు.

Leave a Comment