వాజపేయికి భారతరత్న?

41407656918_625x300న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. సంప్రదాయానికి భిన్నంగా ఒకేసారి ఐదుగురికి అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేయాలని కూడా ఎన్డీఏ సంకీర్ణ సర్కారు భావిస్తోంది. తొలిసారిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయబోతున్న నరేంద్ర మోడీ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఐదు పతకాలు తయారు చేయాలని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మింట్ సంస్థను కేంద్ర హెంమంత్రిత్వ శాఖ ఆదేశించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.

స్వాతంత్ర్య సమరయోధులు సుభాష్‌చంద్రబోస్, మదన్ మోహన్ మాలవ్య, హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌లతో పాటు వాజపేయికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాయుధ పోరాటంతో స్వాతంత్ర్య సమరం సాగించిన సుభాష్‌చంద్రబోస్ కు మరణాంతరం 1992లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అయితే దీనిపై వివాదం రేగడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కలేదు. కాగా యూపీఏ ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రేవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు భారతరత్న ప్రదానం చేసింది.