అంతర్జాతీయ దర్యాప్తునకు సిద్ధమే!

71405800716_625x300మలేసియా విమాన దుర్ఘటనపై రష్యా అంగీకారం

 ఐసీఏఓ నేతృత్వంలో నిష్పాక్షిక దర్యాప్తునకు జర్మనీతో కలసి నిర్ణయం
 పేల్చింది రష్యన్లే.. సాక్ష్యాలున్నాయి: ఉక్రెయిన్
 మృతుల్లో మలేసియా ప్రధాని నానమ్మ
 
 లమాస్కో/బెర్లిన్/కీవ్/కౌలాలంపూర్: మలేసియా విమాన దుర్ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తునకు రష్యా అంగీకరించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం ఈ మేరకు అంగీకారానికి వచ్చారు. నిష్పాక్షికంగా, సునిశితంగా సవివర దర్యాప్తు జరిపేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) నిర్దేశకత్వంలో ఒక అంతర్జాతీయ, స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తక్షణమే ఘటనాస్థలికి వెళ్లడానికి ఆ కమిషన్‌కు అవకాశం కల్పించాలని, దానివల్ల ఘటనకు దారితీసిన పరిస్థితులను అంచనా వేసేందుకు, సాక్ష్యాలను సేకరించేందుకు, తొందరగా మృతదేహాలను తరలించేందుకు వీలు కలుగుతుందని వారు నిర్ణయించారు. పుతిన్, మెర్కెల్‌ల ఫోన్ సంభాషణ అనంతరం ఈ మేరకు రష్యా, జర్మనీలు శనివారం అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి. తూర్పు ఉక్రెయిన్‌లో తక్షణమే రక్తపాతం ఆగాలని, సంబంధిత వర్గాలతో చర్చలు పునఃప్రారంభం కావాలని ఇరువురు నేతలు పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులో ‘ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్’ ఆధ్వర్యంలో రెండు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయాలన్న రష్యా సూచనను అమలు చేయాల్సిన అవసరం ఉందని వారొక నిర్ణయానికి వచ్చారు.

ఇది రష్యా ఘాతుకమే.. కాగా, మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూల్చివేత రష్యా పనేనని ఉక్రెయిన్ అధికారికంగా ఆరోపించింది. రష్యా సమాఖ్య సహకారంతో రష్యన్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, అందుకు సంబంధించిన సాక్ష్యాలను క్రోడీకరిస్తున్నామని శనివారం ప్రకటించింది. ‘క్షిపణి వ్యవస్థను నిర్వహించింది రష్యన్ సిబ్బందేనన్న విషయం మాకు స్పష్టంగా తెలుసు. ఇంటిపేర్లతో సహా వారి పేర్లను ఇవ్వాలని రష్యాను డిమాండ్ చేస్తున్నాం’ అని ఉక్రెయిన్ నిఘా విభాగ ప్రధానాధికారి విటలీ నాదా అన్నారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు తిరుగుబాటుదారులకు రష్యా సహకరిస్తోందంటూ ఉక్రెయిన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఘటనాస్థలి నుంచి 38 మృతదేహాలను తిరుగుబాటుదారులు తీసుకెళ్లారని, అలాగే విమాన శకలాలను రష్యా తరలించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అందులో ఆరోపించింది. అమ్‌స్టర్‌డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై కూలిపోయిన ఘటనలో 298 మంది మరణించిన విషయం తెలిసిందే.

మాపై ఆరోపణలు అమెరికా కుట్ర.. ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. అలాగే, రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాదులే విమానాన్ని కూల్చారన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్ అజెండాను ముందుకు తీసుకురావడం కోసం అమెరికా, పశ్చిమదేశాలు కలిసి నేరాన్ని తమపై నెడుతున్నాయని రష్యా ఉపవిదేశాంగ మంత్రి సెర్గీ ర్యబ్కోవ్ ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు ఫలితాలు రాకముందే అమెరికా నేరాన్ని వేర్పాటువాదులపై, రష్యాపై నెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాగా, తమ విమానం నిషేధిత ప్రాంతంలోకి వెళ్లలేదని, అంతర్జాతీయ సంస్థలు సురక్షితమైనదిగా పేర్కొన్న మార్గంలోనే ప్రయాణించిందని మలేసియా ప్రకటించింది. అది బిజీగా ఉండే మార్గమని, ఆకాశంలో హైవేగా దాన్ని పరిగణిస్తారని పేర్కొంది. ‘ఆకాశంలో నిబంధనలను సరిగానే పాటించాం. భూమిపైనే యుద్ధ నియమాలను అతిక్రమించారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం ఘటనాస్థలికైనా సరైన రక్షణ కల్పించండంటూ ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శుక్రవారం రాత్రి తాను మాట్లాడానని, నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు అవసరాన్ని ఆయనకు వివరించానని మలేసియా ప్రధాని నజిబ్ రజాక్ తెలిపారు. కాగా, మలేసియా దర్యాప్తు అధికారుల బృందం శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకుంది. కాగా, నజిబ్ నానమ్మ కూడా విమాన ప్రమాదంలో మరణించిందని మలేసియా రక్షణ మంత్రి నిర్ధారించారు.
 
రాష్ట్రపతి సంతాపం..  298 మందిని బలి తీసుకున్న మలేసియా విమాన దుర్ఘటనపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మలేసియా రాజుహలిమ్‌కు సందేశం పంపించారు. అలాగే, ఈ దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మలేసియా ప్రధానమంత్రి నజిబ్ రజాక్‌కు భారత ప్రధాని నరేంద్రమోడీ సందేశం పంపించారు.

Leave a Comment