వన్డేల్లో భారత్ మళ్లీ నెంబర్‌వన్

downloadదుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా మళ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో విజయంతో భారత్ 114 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియాను సమం చేసింది. ఐతే జింబాబ్వే చేతిలో ఆసీస్ ఓడడంతో ఒంటరిగా ఒకటో ర్యాంకును సాధించింది. ”ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయంతో ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ ర్యాంకు ఖరారైంది” అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా.. భారత్‌తో నెంబర్‌వన్ ర్యాంకును పంచుకుంది. తాజా ఓటమితో ఆస్ట్రేలియా మూడు రేటింగ్ పాయింట్లు కోల్పోయి 111 పాయింట్లతో దక్షిణాఫ్రికా (113), శ్రీలంక (111)ల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. వచ్చే వారంలో ఐదు వన్డేలు జరగనున్న నేపథ్యంలో ర్యాంకింగ్స్‌లో మార్పులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వారం తర్వాత కూడా భారత్ నెంబర్‌వన్‌గా కొనసాగాలంటే ఇంగ్లాండ్‌తో మిగతా రెండు వన్డేల్లో గెలవాలి. అంతేకాదు.. ముక్కోణపు సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో ఇంకా ఆడాల్సివున్న రెండు వన్డేల్లో (ఫైనల్లో ఈ జట్లే తలపడొచ్చు) ఆస్ట్రేలియా ఒక్కటైనా నెగ్గాలి. ముక్కోణంలో మిగిలిన రెండు వన్డేల్లో, ఫైనల్లోనూ గెలిస్తే దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఆసీస్‌కు కూడా తిరిగి నెంబర్‌వన్ అయ్యే అవకాశముంది. ఇంగ్లాండ్.. భారత్‌పై ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి, ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాపై లీగ్ మ్యాచ్‌లో, సెప్టెంబరు 6న జరిగే ఫైనల్లో గెలిస్తే ఆ జట్టు నెంబర్‌వన్ అవుతుంది.