పంజాబ్ బోణీ

images (6)మొహాలి: ఐపీఎల్-7 రన్నరప్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. తన తొలి సీఎల్‌టీ20 టోర్నీలో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు, బిగ్‌బాష్ లీగ్ రన్నరప్ హోబర్ట్ హరికేన్స్‌ను ఓడించింది. మొదట తిసార పెరీరా (2/17), అక్షర్ పటేల్ (1/20), అవానా (1/25) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హోబర్ట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులే చేయగలిగింది. అనంతరం బొలింజర్ (2/30) ధాటికి పంజాబ్ తడబడినా.. మాక్స్‌వెల్ (43; 25 బంతుల్లో 4X4, 2X6), బెయిలీ (34 నాటౌట్; 27 బంతుల్లో 5X4), తిసార పెరీరా (35 నాటౌట్; 20 బంతుల్లో 4X4, 1X6) చెలరేగి ఆడి.. జట్టుకు విజయాన్నందించారు. పంజాబ్ 14 బంతులుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన పెరీరా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
మెరిసిన మాక్స్‌వెల్: 23/3.. నాలుగో ఓవర్లో మాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చేసరికి పంజాబ్ స్కోరిది. సెహ్వాగ్ (0) తొలి బంతికే వెనుదిరగ్గా.. సాహా (11), మిల్లర్ (0) కూడా విఫలమవడంతో పంజాబ్ ఛేదన పేలవంగా ఆరంభమైంది. ఐతే పరిస్థితులతో తనకేం సంబంధం లేనట్లు ఆడే మాక్స్‌వెల్.. తనదైన శైలిలో చెలరేగాడు. సిక్సర్‌తో ఖాతా తెరిచిన మాక్స్‌వెల్ ఉన్నంతసేపు మెరుపు షాట్లతో అలరించాడు. 11వ ఓవర్లో అతను ఔటయ్యే సమయానికి సగానికి పైగా లక్ష్యం కరిగిపోయింది. ఆ తర్వాత బెయిలీ, పెరీరా అభేద్యమైన ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు.

Leave a Comment