న్యూఢిల్లీ, జమ్మూ: సరిహద్దులో తరచూ తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించడం కోసం భారత్, పాకిస్థాన్ సరిహద్దు భద్రత దళాల అధికారులు బుధవారం సమావేశమైనా చర్చల్లో పురోగతి కానరాలేదు. సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) 33వ బెటాలియన్ కమాండెంట్ ఎస్.కె.సింగ్ భారత బృందానికి, 19-డిజర్ట్ రేంజర్స్ వింగ్ కమాండర్ మహ్మద్ వకార్ పాకిస్థాన్ బృందానికి నాయకత్వం వహించారు. ముప్పావుగంట పాటు చర్చలు జరిగాయి. ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ తరచూ జరుపుతున్న కాల్పులపై ఈ సమావేశంలో చర్చించలేదని అధికారులు తెలిపారు. చర్చలు కొనసాగించాలని ఉభయులూ నిర్ణయించినట్లు చెప్పారు.
హోంమంత్రికి బీఎస్ఎఫ్ డీజీ నివేదన
జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి నెలకొన్న పరిస్థితులను బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డి.కె.పాథక్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదించారు.. సరిహద్దులో తగిన చర్య తీసుకునేందుకు బీఎస్ఎఫ్‌కు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.
Recent Comments