సర్వే లక్ష్యాలను సునీత సింపుల్‌గా తేల్చేశారు!!

images (15)మహా సమగ్ర సర్వే.. లెక్కా పక్కా అంటూ తెలంగాణ సర్వేకు పూనిక వహిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం అందుకు అనేక కారణాలను చూపిస్తోంది. ప్రధానంగా వారు చెబుతున్నదెల్లా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో దొంగలు ఉన్నారని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకంటె రేషన్‌కార్డుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నదని! అందులో ఉన్న తేడాలను అరికట్టడానికి వాస్తవంగా ఉన్న కుటుంబాల లెక్క తేలుస్తున్నాం అంటూ కేసీఆర్‌ తొలినుంచి చెబుతున్నారు. తీరా సర్వే  ఆచరణ రూపం దాలుస్తున్న సమయానికి అది ఆంధ్రోళ్ల లెక్క తీయడానికి ఉద్దేశించిన సర్వే లాగా మారిపోయింది. అందులో ప్రశ్నలుగా సంధిస్తున్న అనేక ప్రశ్నలు ఆంధ్రోళ్ల లెక్కలు తీయడానికి ఉద్దేశించినవిగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ విషయాలను పక్కన పెడితే… దొంగ రేషన్‌ కార్డులను ఏరివేయడమే సర్వే లక్ష్యం అని కేసీఆర్‌ తొలుత ఏదైతే  ప్రకటించారో.. దాన్ని ఏపీ ప్రభుత్వం చాలా సింపుల్‌గా తేల్చేసినట్లు కనిపిస్తోంది.  రేషన్‌ కార్డుకు ఆధార్‌ కార్డుతో ముడిపెడుతున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించేశారు. రుణమాఫీకి కూడా ఆధార్‌ తో లింకు పెట్టిన సంగతి ఇదివరకే జరిగింది. తాజాగా రేషన్‌ కార్డులకు కూడా లింకు పెట్టడం అనగానే.. నకిలీ రేషన్‌ కార్డులను ఏరివేయడం చిటికెలో సాధ్యమయ్యే పని! ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్‌ కార్డులను చెలామణీలోంచి రద్దు చేసి.. కొత్త రేషన్‌ కార్డులు ఇస్తాం అని.. పాత రేషన్‌కార్డు మరియు ఆధార్‌ కార్డు చూపించి వాటిని తీసుకెళ్లాలనే నిబంధన వస్తే చాలు.. దెబ్బకు దొంగ కార్డులు అన్నీ రద్దయిపోయే అవకాశం ఉంటుంది.  నిజానికి కేసీఆర్‌ సర్కారు అయినా కేవలం నకిలీ లబ్ధిదారుల్ని ఏరివేయడం మాత్రమే తమ లక్ష్యం అయితే గనుక.. ఈపాటి కసరత్తు చేసినా సరిపోతుంది. కానీ ఈ సర్వేతో ముడిపెట్టి.. హిడెన్‌ అంశాలు చాలా ఉండడం వల్లనే.. కేసీఆర్‌ సర్కారు.. గోటితోపోయే నకిలీల ఏరివేతను.. సర్వే వరకు తీసుకువచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.