తృణమూల్, టీడీపీలకు రాష్ట్రపతి తలంటు

51406921897_625x300న్యూఢిల్లీ : తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిట్టిపోశారు. ఇద్దరికీ పూర్తిగా తలంటారు. పార్లమెంటు సభ్యులు అయినందుకు కాస్తంతైనా మర్యాదగా వ్యవహరించాలని, పార్లమెంటు గౌరవాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలోని ఓ గది గురించి రెండు పార్టీలకు చెందిన ఎంపీలు జుట్లు పట్టుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రణబ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ”దయచేసి.. మీకు పుణ్యం ఉంటుంది. మీరు తప్ప ఎవరూ చేయలేరు. అది మన బాధ్యత. ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు పార్లమెంటు గౌరవ మర్యాదలను కాస్తంతైనా కాపాడండి” అని ఉత్తమ పార్లమెంటేరియన్లకు అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రణబ్ అన్నారు.

చాలా సంవత్సరాల పాటు పార్లమెంటు ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరానికి ప్రతీకగా పార్లమెంటు నిలుస్తుందని, తొలిసారి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు మెట్ల మీద శిరస్సు వంచి ప్రణమిల్లడం తన గుండెను తాకిందని రాష్ట్రపతి చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయానికి ఉన్న పవిత్రతకు ఇది నిదర్శనమన్నారు.

పార్లమెంటు భవనంలోని గ్రౌండుఫ్లోర్ ఐదో నెంబరు గది కోసం తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు వాదులాడుకున్నారు. చాలాకాలంగా టీడీపీ ఆధీనంలో ఉన్న ఆ గదిని తాజాగా తృణమూల్ కాంగ్రెస్కు కేటాయించారు. లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ కావడంతో ఆ పార్టీకి ఈ గది ఇచ్చారు. కానీ గది ఖాళీ చేసేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో గొడవ మొదలైంది.