ఉపాధ్యాయులు వెలుగునిచ్చే దివ్వెలు: రాష్ట్రపతి

downloadన్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో వారు అందిస్తున్న సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తులు లాంటి వారని..ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పరితపిస్తుంటారని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఇదే విధంగా విద్యార్థులను సక్రమమార్గంలో పెట్టే మార్గదర్శకులుగా, తత్త్వవేత్తలుగా, ఓ స్నేహితునిలా మెలగాలని ఆయన సూచించారు.విద్యార్థులు తమ గురువుల పట్ల సంపూర్ణ గౌరవాన్ని చూపించాల్సి ఉందన్నారు. ఇక్కడి రాష్ట్రపతి భవన్ దర్బార్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించారు.
మరింత సమర్థవంతమైన ఉపాధ్యాయులు భారత్‌కు అవసరం: భోదన రంగలో నైపుణ్యం పెంపు అనేది దేశానికి ప్రధాన సమస్యగా మారిందని ప్రణబ్ అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మరింతనైపుణ్యం, పట్టుదల కలిగిన ఉపాధ్యాయులు రావాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు మారుతున్న పరిస్థితుల కనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. శుక్రవారం ఇక్కడ జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ విద్యార్థులను ప్రపంచస్థాయి విజ్ఞానవంతులుగా తయారుచేయడానికి కృతనిశ్చయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. సహనం, లౌకికతత్వం, సంఘజీవనం వంటి అంశాలను విద్యార్థులకు నూరుపోసి మెరుగైన, భద్రమైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 357 మంది ఉపాధ్యాయులకు అవార్డులందజేశారు.

Leave a Comment