సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

download (3)చిత్తూరు (సెంట్రల్) : ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలోని సమావేశమందిరం లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని  సూచించారు. ప్రజావాణి పోర్టల్ యూజర్ నేమ్, పాస్‌వర్ట్‌లను అన్ని శాఖలకు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సమావేశంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో  చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన ఇసుక పాలసీని అనుసరించి జిల్లాలో ఎంతమేర ఇసుక నిల్వలున్నాయి? నిర్మాణంలో ఉన్న భవనాలెన్ని ? వాటికి ఎంత ఇసుక అవసరం ?  అనే అంశాలపై చర్చించారు.

ఇసుక తవ్వకం ద్వారా భూగర్భజలాలకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయూ ? అని  గనులు, నీటిపారుదల, భూగర్భజలశాఖ, డీఆర్‌డీఏ, డ్వామా సమన్వయంతో పరిశీలించి కొనుగోలుదారులతో ఎంఓయూలను రూపొందించాలన్నారు. అర్హమైన మహి ళా సంఘాలను గుర్తించి వాటి ద్వారా ఇసుక అమ్మకాలను ప్రారంభించే పనిని అక్టోబర్ 1 నుంచి చేపట్టాలన్నారు. జిల్లాలో మీ-సేవ, తహశీల్దార్ కార్యాలయం, ఎన్‌ఐసీల ద్వారా రేషన్‌కార్డుల నిమిత్తం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, ఆ సంస్థ జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. రేషన్‌కార్డుల్లో మార్పు లు, చేర్పులు, సవరణ, సౌకర్యాల కార్యక్రమాలపై, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై జిల్లాలోని కేబుల్ టీవీల్లో ప్రచారం చేపట్టాలన్నారు.

ఆధార్ సీడింగ్ ద్వారా  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి  పెన్షన్లు, ఇంటి మంజూరు, రేషన్‌కార్డు జారీకి అర్హులను గుర్తించాలన్నారు.  ఈ నెల 19న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాపర్యటనకు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శస్త్రచికిత్సలు, ఇతర చికిత్సలు ఎక్కడ బాగా జరుగుతాయో గుర్తించి అక్కడ డాక్టర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ నెల 27న కేంద్ర వికలాంగుల మంత్రి జిల్లాకు వస్తున్నారని, తిరుపతి ఇందిర మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వికలాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వికలాంగుల శాఖ ఏడీ, జిల్లా విద్యాశాఖాధికారి, ఎస్‌ఎస్‌ఏ పీఓ, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా పీడీలు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఎక్కడెక్కడ ప్రారంభించనున్నారో నివేదికలు సమర్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment