భారత్‌లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!

downloadవాషింగ్టన్ :

భారతదేశంతో సత్సంబంధాలు ఉంటే మంచిదని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన యంత్రాంగంలో పలువురు భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకేసి భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మను భారతదేశంలో అమెరికా రాయబారిగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా హోంశాఖలో గతంలో సహాయ మంత్రి హోదాలో పనిచేసిన వర్మ..  ప్రస్తుతం స్టెప్టో అండ్ జాన్సన్ అనే న్యాయ సంస్థలో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు.

ఇంతకుముందు భారత దేశంలో అమెరికా రాయబారిగా వ్యవహరించి, తన పదవీకాలంలో పలు వివాదాలు మూటగట్టుకున్న నాన్సీ పావెల్ రాజీనామా చేసినప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. జార్జిటౌన్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసిన రాహుల్ వర్మ.. జాతీయ భద్రతా చట్టం, అంతర్జాతీయ వ్యవహారాలు తదితర విషయాల్లో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొందారు. ఇంతకుముందు ఆయన హిల్లరీ క్లింటన్‌తో కలిసి పనిచేశారు. గతంలో అమెరికా ఎగుమతి నియంత్రణలు, ఆర్థిక ఆంక్షలపై కూడా ఆయన కృషి చేశారు. కొంతకాలం పాటు అమెరికా వైమానిక దళంలో కూడా ఎయిర్ ఫోర్స్ జడ్జి అడ్వకేట్‌గా పనిచేశారు.

Leave a Comment