కేంద్రం కంటితుడుపు.. రూ. 2 లక్షల పరిహారం

telangana-train-accident-unfortunate-railway-minister-d-v-sadananda-gowdaరూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే మంత్రి
 న్యూఢిల్లీ: మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంపై కేంద్రం నామమాత్రంగా స్పందించింది. ఈ ఘటన పై రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్‌సభలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటన చేశారు. తెలంగాణలో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సభకు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే మానవీయకోణంలో ఆలోచించి ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు.
 
 తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పరిహారం చాలా తక్కువగా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇది సరికాదని, పరిహారం పెంచాలని నిలదీశారు. దీంతో రైల్వే మంత్రి స్పందించారు. ఇది సాధారణంగా ప్రకటించే పరిహారమని, మరింత నష్టపరిహారం, ఇతర సహాయాలను తర్వాత రైల్వే శాఖ చేపడుతుందని వివరణ ఇచ్చారు. కాగా, బాధితులకు రూ. ఐదు లక్షల నష్టపరిహారం అందించాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఇటు లోక్‌సభలో ఎంపీలు జితేందర్ రెడ్డి, అహ్లూవాలియా కూడా ఇదే డిమాండ్ చేశారు.

Leave a Comment