అనుభవ రాహిత్యం వల్లే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కుర్రాళ్లు ఘోరంగా విఫలమయ్యారని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వన్డే సిరీస్‌కు టీమ్ డైరెక్టర్‌గా బీసీసీఐ తనను ఎంపిక చేయడాన్ని గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని.. జట్టు కోసం తాను చేయగలిగిందంతా చేస్తానని అతను చెప్పాడు. కొత్త బాధ్యతలభారత క్రికెట్‌కిది కీలకమైన సమయం. టీమ్ డైరెక్టర్ బాధ్యతల గురించి చెప్పగానే సరేనన్నా. ఈ పరిస్థితుల్లో నా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా. ఈ పని కష్టమా సులభమా అని ఆలోచించలేదు. నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు బోర్డే కారణం. అందుకే భారత జట్టుకు సాయపడటానికి ముందుకొచ్చా. డైరెక్టర్‌గా జట్టుకు సంబంధించిన అన్ని విషయాలనూ సమీక్షిస్తా. వన్డే సిరీస్ వరకు అందరూ నాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్లెచర్‌ను పక్కనబెట్టారన్నది వాస్తవం కాదు. అతడే ప్రధాన కోచ్. బంగర్, అరుణ్ అతడికి సహాయపడతారు. నా బాధ్యతల గురించి చెప్పగానే వీళ్లను కోచ్‌లుగా కావాలని నేనే కోరా. టెస్టు సిరీస్‌లో భారత్ చిత్తవడానికి ఆటగాళ్ల అనుభవ రాహిత్యమే కారణం. గతంలో సీనియర్లున్న జట్లు కూడా ఇంగ్లాండ్‌లో ఓడాయి. 1974లో భారత్ 3-0తో ఓడింది. గత పర్యటనలో పేరున్న ఆటగాళ్లున్నా వైట్‌వాష్‌కు గురయ్యారు. వాళ్లతో పోలిస్తే ప్రస్తుత జట్టులో ఆటగాళ్లకు అనుభవం చాలా తక్కువ. అయినా ఈ పర్యటనలో ఓ గొప్ప విజయం సాధించారు. కాకపోతే చివరి మూడు టెస్టుల్లోనూ జట్టు వెన్నెముకే లేనట్లు కుప్పకూలడమే ఆందోళన రేకెత్తించింది. తొలి టెస్టు మినహా పిచ్‌లు కఠినంగా ఉన్న మాట వాస్తవం. కానీ కుర్రాళ్లు ఏమాత్రం పోరాట పటిమ చూపించలేదు. ఇదే జట్టు పోరాడి, 1-3తో ఓడితే జనాలు అంగీకరించేవారు.
కుక్‌ను చూసి నేర్చుకోవాల్సింది: టెస్టు సిరీస్‌లో ఇంకో ఆందోళనకర విషయం.. పదే పదే ఒకే తరహా తప్పులు చేసి ఔటవడం. ఎవరైనా తప్పులు చేస్తారు. కానీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. కుక్ కూడా సిరీస్ ఆరంభంలో ఇబ్బంది పడ్డాడు. కానీ తర్వాత తన తప్పులు తెలుసుకుని దిద్దుకున్నాడు. స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు క్రీజు ముందుకొచ్చి నిలబడి ఆడాడు. మనవాళ్లు అతణ్ని చూసి నేర్చుకోవాల్సింది. కానీ అలా చేయలేదు. ప్రస్తుత అనుభవంతో తర్వాతి పర్యటనలో ఈ ఆటగాళ్లు మెరుగ్గా ఆడొచ్చేమో. అనుభవజ్ఞులైతే క్లిష్ట పరిస్థితుల్ని ఎదురొడ్డి నిలుస్తారు. వెనుకబడినా పుంజుకుంటారు. ఇక్కడే అనుభవం కీలక పాత్ర పోషిస్తుంది. కోహ్లి, పుజారాలపై జనాలు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. వాళ్లింత పేలవంగా ఆడటం ఆందోళన కలిగించింది. ఐతే గవాస్కర్, ద్రవిడ్ లాంటి గొప్ప ఆటగాళ్లకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వాళ్లిద్దరూ త్వరలోనే పుంజుకుంటారు. వన్డే సిరీస్‌లో కుర్రాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పిస్తా. ఆటను ఆస్వాదించమని చెబుతా. దూకుడుగా ఆడేందుకు ప్రోత్సహిస్తా.
ద్రవిడ్ పేరూ చర్చకొచ్చింది!
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా ఘోరవైఫల్యం నేపథ్యంలో టీమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రిని నియమించడానికి ముందు బోర్డులో పెద్ద చర్చే జరిగినట్లు తెలిసింది. టీమ్ డైరెక్టర్‌గా నియమించేందుకు ఓ దశలో రాహుల్ ద్రవిడ్ పేరును కూడా పరిగణించినట్లు తెలిసింది. అంతే కాదు.. రవిశాస్త్రికి జట్టు బాధ్యతల అప్పగింత తాత్కాలికం కాదని, భవిష్యత్తులోనూ అతడి సేవల్ని వినియోగించుకోవచ్చని బోర్డు వర్గాలు అంటున్నాయి. ”రవిశాస్త్రిని టీమ్ డైరెక్టర్‌గా నియమించడం తాత్కాలిక ఏర్పాటు కాదు. అతను మున్ముందు కూడా జట్టుతో కొనసాగొచ్చు. ఈ పదవి కోసం ద్రవిడ్ పేరును కూడా చర్చించారు. జట్టులోని చాలామంది ఆటగాళ్లతో అతడికి సమన్వయం ఉండటమే దీనికి కారణం. ఐతే గతంలోనూ జట్టుతో కలిసి పని చేసిన అనుభవముండటంతో రవిశాస్త్రినే ఎంచుకున్నారు” అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. రవిశాస్త్రి 2007లో తాత్కాలికంగా జట్టు క్రికెట్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో ద్రవిడే కెప్టెన్ కావడం విశేషం. రవిశాస్త్రి ఏమన్నాడో అతడి మాటల్లోనే..
Recent Comments