రవితేజ ‘పవర్’ టీజర్ విడుదల

71407470560_625x300హైదరాబాద్ : మాస్ మహరాజా రవితేజ చాలారోజుల తర్వాత వెండితెరమీద కనిపిస్తున్నారు. ఏడాదికి పైగా గ్యాప్ తర్వాత ఆయన నటించిన ‘పవర్’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో బలుపు విడుదలైన తర్వాత మళ్లీ ఇంతవరకు రవితేజ సినిమాలేవీ రాలేదు. ఇప్పుడు మళ్లీ ‘పవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఈ సినిమాలో రవితేజ సరసన హన్సికా మొత్వానీ, రెజీనా కాసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాక్లైన్ వెంకటేశ్ నిర్మించగా, ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు.

2012 సంవత్సరంలో రవితేజ నటించిన నాలుగు సినిమాలు విడుదలైనా.. ఒక్కటీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడకపోవడంతో ఆ సంవత్సరం మాస్ మహారాజకు నిరాశనే మిగిల్చింది. ఆ సంవత్సరంలో విడుదలైన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు.. వేటికీ పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. అయితే, 2013లో రవి మళ్లీ తనదైన స్టైల్లో ‘బలుపు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రుతిహాసన్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకులు మళ్లీ పాత రవితేజను చూశారు. దాంతో సినిమా మంచి హిట్టయ్యింది. ఆ తర్వాత వస్తున్న సినిమా..పవర్. ఇందులో రవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయనంటూ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. పవర్ అనేది సినిమా టైటిల్ కాగా, ‘అన్లిమిటెడ్’ అనేది దీని సబ్టైటిల్.