రూ. 610 కోట్లకు రాజీ!

61407268456_625x300మ్యూనిచ్ (జర్మనీ): ముడుపుల ఆరోపణల నుంచి విముక్తి పొందడానికి ఫార్ములావన్ (ఎఫ్1) అధినేత బెర్నీ ఎకిల్‌స్టోన్ కోర్టు బయట ఒప్పందానికి సిద్ధమయ్యాడు. తనపై విచారణ ముగించేందుకు ఏకంగా 10 కోట్ల అమెరికా డాలర్లు (రూ. 610 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించాడు. జర్మనీ న్యాయచరిత్రలో ఓ కేసు రాజీకి ఇదే భారీ మొత్తం. జర్మనీ చట్టాల ప్రకారం… ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు చారిటీకి లేదా ఖజానాకు నిర్ణీత మొత్తం చెల్లించడానికి అంగీకరిస్తే… అందరి ఆమోదంతో వారిపై విచారణను ఉపసంహరించుకునే వీలుంది.
 
 తనకు మేలు చేసిన కంపెనీ ఫార్ములావన్‌లో వాటా కొనుగోలు చేసేందుకు 2006లో జర్మనీ బ్యాంక్ అధికారికి ఎకిల్‌స్టోన్ 4 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 268 కోట్లు) ముడుపులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పలు కారణాలరీత్యా ఈ విచారణకు తెరదించాలనే ఉద్దేశంతో 83 ఏళ్ల ఎకిల్‌స్టోన్ కోర్టు బయట ఒప్పందానికి మొగ్గుచూపాడు. వారంలోపు ఈ మొత్తాన్ని ఎకిల్‌స్టోన్ అందజేస్తే అతనిపై విచారణను తాత్కాలికంగా ముగిస్తామని మ్యూనిచ్ కోర్టు జడ్జి పీటర్ నోల్ తెలిపారు.