గురుశిష్యుల వేరుబాట!

images (7)హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌లో వూహించని పరిణామం. సంచలన విజయాలతో భారత బ్యాడ్మింటన్‌ను కొత్త పుంతలు తొక్కించిన గురుశిష్యులు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ వేరుబాట పట్టారు! భారత జట్టు చీఫ్ కోచ్ గోపీచంద్ దగ్గర శిక్షణకు సైనా గుడ్‌బై చెప్పింది. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనె అకాడమీలో భారత జట్టు మాజీ కోచ్ విమల్‌కుమార్ దగ్గర ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకుంది. ఆసియా క్రీడల నేపథ్యంలో తాత్కాలికంగా బెంగళూరులో శిక్షణకు వెళ్తున్నట్లు సైనా ప్రకటించింది! ‘బెంగళూరులో విమల్‌కుమార్ దగ్గర శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఉబెర్ కప్ సందర్భంగా విమల్ చెప్పిన చిట్కాలు నాకు ఉపయోగపడ్డాయి. ఆసియా క్రీడల తర్వాత మళ్లీ గోపీచంద్ అకాడమీకి వస్తా. బెంగళూరులో శిక్షణ నాకు ఉపయోగపడుతుందో లేదో చూద్దామని వెళ్తున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్ జరుగుతున్నప్పుడే గోపీ సర్‌కు ఈ విషయం చెప్పా. గోపీ కూడా సరేనన్నాడు” అని సైనా పేర్కొంది.
బెంగళూరులో సాధన గురించి గోపీతో సైనా చర్చించానని చెబుతున్నా.. చీఫ్ కోచ్ మాత్రం తనకీ విషయం తెలియదన్నట్లు మాట్లాడటం గమనార్హం. మంగళవారం విలేకరుల సమావేశంలో గోపీని సైనా నిర్ణయం గురించి ప్రశ్నించగా.. ”ఈ రోజు ఉదయం పత్రికలో ఈ వార్త చూశా. గురుశిష్యులుగా మాది పదేళ్ల అనుబంధం. క్రీడాకారులు దేశంలో ఎక్కడైనా సాధన చేయొచ్చు. సైనా నిర్ణయం గురించి స్పందించను. తర్వాత చూద్దాం” అని గోపీ తెలిపాడు. సైనా ఫామ్ గురించి అడగ్గా.. ”ఉబెర్ కప్‌లో సైనా బాగా ఆడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనకంటే మెరుగైన క్రీడాకారిణి లీ జురుయ్ చేతిలో ఓడింది. ఆమె ఫామ్‌పై ఆందోళన అనవసరం” అని తెలిపాడు. ఐతే చైనా క్రీడాకారుల ఎంట్రీలపై పరిమితి విధించాలంటూ సైనా చేసిన వ్యాఖ్యలను గోపీ సమర్థించలేదు. ”నా వరకైతే అత్యుత్తమ క్రీడాకారులు ఆడాల్సిందే. వారిపై ఎలాంటి పరిమితి విధించొద్దు” అన్నాడు.

తొలిసారి కాదు..: 2011లోనూ గోపీ, సైనాల మధ్య విభేదాలు వచ్చాయి. సాయ్ కోచ్ భాస్కర్‌బాబు వద్ద శిక్షణకు మొగ్గుచూపింది. ఐతే మూడు నెలల్లోనే సైనా మనసు మార్చుకుని గోపీ దగ్గరికి తిరిగొచ్చింది. ఆ తర్వాత 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఇటీవల సైనా ఫామ్ బాలేదు. అదే సమయంలో సింధు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో సత్తా చాటింది. సింధుతో పాటు శ్రీకాంత్, గురుసాయిదత్ వంటి యువ క్రీడాకారులు వెలుగులోకి రావడం.. గోపీ అందరిపై దృష్టిసారిస్తుండటం వల్లే.. సైనా గోపీ అకాడమీని వీడి బెంగళూరుకు పయనమైనట్లు తెలుస్తోంది. సైనా అక్కడ 15 రోజులే శిక్షణ అని చెబుతున్నా.. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండొచ్చని తెలుస్తోంది.