సెమీస్‌లో సానియా జోడి

61407613452_625x300 (1)రోజర్స్ కప్ టోర్నీ
మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్) -కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ 6-2, 6-1తో రాకెల్ జోన్స్-అబిగెల్ స్పియర్స్‌లపై గెలిచారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట అమెరికా జోడి  సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో రెండో సీడ్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-పెంగ్ షుయె (చైనా) లతో సానియా ద్వయం తలపడుతుంది. ఈ సీజన్‌లో సు వీ సెయి-పెంగ్ షుయెలతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సానియా-కారా బ్లాక్‌లకు ఓటమి ఎదురైంది.

‘ఆప్టస్’ సెమీస్‌లో సనమ్ జోడి

ఆప్టస్ (అమెరికా): ఆప్టస్ చాలెంజర్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ జోడి సనమ్ సింగ్-పురవ్ రాజా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సనమ్-పురవ్ జంట 7-6 (7-4), 6-2తో ఆండ్రియా కొలారిని (అర్జెంటీనా)-సేసర్ రమిరెజ్ (మెక్సికో) జోడిపై విజయం సాధించింది. నాలుగో సీడ్ భారత జంట ఇక సెమీస్‌లో టాప్ సీడ్ ఆస్టిన్ క్రాజిసెక్ (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడితో తలపడనుంది. మరోవైపు సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. కజకిస్థాన్‌కు చెందిన మైఖేల్ కుకుష్కిని చేతిలో సోమ్‌దేవ్ 5-7, 6-4, 2-6తో ఓడిపోయాడు.