మిక్స్‌డ్ ఫైనల్లో సానియా జోడీ

saniyaభారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు చేరువైంది. యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా, బ్రూనో సోర్స్ (బ్రెజిల్) జంట ఫైనల్‌కు దూసుకెళ్లింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన సెమీఫైనల్లో 7-5, 4-6, 10-7తో అన్‌సీడెడ్ యుంగ్ జన్ చన్ (తైపీ), రాస్ హచిన్స్ (జర్మనీ)పై విజయం సాధించింది. ఫైనల్లో సానియా జోడీ స్పియర్స్ (అమెరికా), గొంజాలెజ్ (మెక్సికో)తో తలపడుతుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరడం సానియాకు ఇది ఐదో సారి. 2008 (ఆస్ట్రేలియన్ ఓపెన్)లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సానియా.. 2009 (ఆస్ట్రేలియన్ ఓపెన్), 2012 (ఫ్రెంచ్ ఓపెన్)లో మహేష్ భూపతితో కలిసి టైటిల్ గెలుచుకుంది. టెకావుతో కలిసి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయింది. యుఎస్ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లోనూ సానియా ఫైనల్ చేరే అవకాశముంది. కారాబ్లాక్‌తో కలిసి బరిలో దిగిన సానియా సెమీస్‌లో హింగిస్, పెనెట్టా (ఇటలీ) జోడీని ఎదుర్కోనుంది. చివరగా 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో సానియా డబుల్స్ ఫైనల్ చేరింది.

Leave a Comment