సానియాకు మరో రూ.కోటి

download (1)హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి భారీ నజరానా ప్రకటించారు. యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియాకు రూ.కోటి అందజేశారు. గురువారం సచివాలయంలో సానియాను సీఎం కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.కోటి చెక్కు అందజేశారు. రానున్న జపాన్ ఓపెన్, చైనా ఓపెన్ టోర్నీల్లో కూడా విజయం సాధించాలని సానియాకు సూచించారు. యుఎస్ ఓపెన్‌కు వెళ్ళేముందు టోర్నీ ఖర్చుల కోసం ప్రభుత్వం తరఫున సానియాకు ముఖ్యమంత్రి రూ.కోటి అందజేశారు. ఆ టోర్నీకి వెళ్ళిన సానియా విజయంతో తిరిగొచ్చింది. జపాన్, చైనా టోర్నీల్లోనూ సానియా విజయం సాధించాలని సీఎం ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మరో రూ.కోటి అందజేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలంగాణ కీర్తిని, హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటాలని ముఖ్యమంత్రి కోరారు.
2002 ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన పవర్ లిఫ్టర్ సూర్యవంశీ హేమలత గురువారం ముఖ్యమంత్రిని కలిసింది. పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించినప్పటికీ.. తర్వాత జరిగిన అంతర్జాతీయ టోర్నీలకు తనను ఎంపిక చేయలేదని హేమలత ముఖ్యమంత్రికి వివరించింది. సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటామని ఆమెకు హామీనిచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేస్తామని.. క్రీడాకారులకు శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీనిచ్చారు.

మరిన్ని విజయాలు సాధిస్తా.. సానియా: ”సీఎం కేసీఆర్ అండతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తా. తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తా. నాపై విశ్వాసంతో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదా కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. దీన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా”నని సానియా తెలిపింది.

Leave a Comment