ఆసియా క్రీడలకు సానియా సై

download (5)బెంగళూరు: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మనసు మార్చుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. పేస్, బోపన్న, సోమ్‌దేవ్‌ల బాటలోనే ఆసియా క్రీడలకు దూరమై.. డబ్ల్యూటీఏ టోర్నీల్లో పాల్గొనాలని సానియా భావించిన సంగతి తెలిసిందే. ర్యాంకు మెరుగు పరుచుకోవాలనుకునే క్రీడాదదకారులు ప్రొఫెషనల్ టోర్నీల్లో పాల్గొంటే తమకు అభ్యంతరం లేదంటూ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) కూడా వ్యాఖ్యానించడంతో సానియా సహా స్టార్లందరూ ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు! ఐతే సానియా మాత్రం ఈ విషయంలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ”నా నిర్ణయం పట్ల సంతోషంగా లేను. అందుకే ఆసియా క్రీడల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. దీని వల్ల 900 పాయింట్లు నష్టపోతానని నాకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తప్పవు” అని సానియా పేర్కొంది. నిర్ణయం మార్చుకోవడంలో ఏమైనా ఒత్తిడి ఉందా అని అడిగితే.. ”అలాంటిదేమీ లేదు. డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో అవకాశాలు తక్కువగానే ఉన్నా.. పతకంతో తిరిగొస్తానని ఆశతో ఉన్నా” అని చెప్పింది. సానియా ఆసియా క్రీడల్లో ఆడతాననడం మంచి విషయమని.. ఐతే ఆమెతో సహా క్రీడాకారులెవ్వరితోనూ ప్రభుత్వం మాట్లాడలేదని ఏఐటీఏ అధ్యక్షుడు అనిల్ ఖన్నా తెలిపాడు.
ప్రధానిని కలిసిన మీర్జా: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిసింది. సానియా వెంట ఆమె తల్లి నసీమా మీర్జా కూడా ఉన్నారు. యుఎస్ ఓపెన్ గెలిచినందుకు ప్రధానే సానియాను ఆహ్వానించి అభినందనలు తెలిపారు. సానియా అంతకుముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసింది.

జాఫ్రీన్‌కు రూ.5 లక్షల సాయం: బధిర టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ (కర్నూలు)కు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేయూత అందించింది. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందు కోసం జాఫ్రీన్‌కు సానియా రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందజేసింది. శుక్రవారం తన నివాసంలో జాఫ్రీన్‌కు రూ.5 లక్షల చెక్కు ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా టెన్నిస్ సాధన చేయలేకపోతున్న జాఫ్రీన్‌కు గత ఏడాది సానియా చేయూత అందించింది. అప్పట్నుంచి తన అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. ఇటీవల జర్మనీలో జరిగిన ప్రపంచ యూత్ బధిరుల టెన్నిస్ కప్‌లో జాఫ్రీన్ సింగిల్స్, డబుల్స్‌లో రెండు రజత పతకాలు భారత్‌కు అందించింది.

Leave a Comment