ఆరేసిన సెరెనా

images (4)మళ్లీ ఆమే! స్నేహితురాళ్ల మధ్య పోరాటంలో సెరెనాదే పైచేయి. యుఎస్ ఓపెన్‌లో ఈ అమెరికా తార ‘ఆరే’సింది. వరుసగా మూడోసారి టైటిల్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ 6-3, 6-3తో కరోలిన్ వోజ్నియాకిని అలవోకగా ఓడించింది. కెరీర్‌లో సెరెనాకు ఇది 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.                                                                                                                                                                                                                                                                                                                                                                                                 అంతిమ సమరం హోరాహోరీగా సాగుతుందని అంతా వూహించినా సెరెనా తన పవర్ టెన్నిస్‌తో ఆ అంచనాలు పటాపంచలు చేసింది. కోర్టులో మెరుపులా కదిలిన విలియమ్స్… శక్తిమంతమైన షాట్లతో విజృంభించి ఆడింది. తొలి సెట్ నుంచి సెరెనాదే ఆధిపత్యం! రెండో గేమ్‌లోనే వోజ్నియాకి సర్వీస్ బ్రేక్ చేసిన సెరెనా… నాలుగో గేమ్‌లో మరోసారి కరోలిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. సర్వీస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వోజ్నియాకి ఏ దశలోనూ సెరెనాకు దీటైన జవాబు ఇవ్వలేకపోయింది. ఆరో గేమ్‌లో మరోసారి వోజ్నియాకి సర్వీస్ బ్రేక్ చేసిన సెరెనా తర్వాత సర్వీస్ నిలబెట్టుకుని 6-3తో తొలి సెట్ చేజిక్కించుకుంది. రెండో సెట్లోనూ వోజ్నియాకి మెరుగ్గా ఆడలేకపోయింది. ఒకవైపు సెరెనా అద్భుతమైన రిటర్న్, బుల్లెట్ సర్వీసులతో అదరగొడుతుంటే మరోవైపు వోజ్నియాకి పదే పదే బంతిని నెట్‌కి కొడుతూ అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెట్ తొలి గేమ్‌లోనే వోజ్నియాకి సర్వీస్ బ్రేక్ చేసిన సెరెనా తర్వాత తన సర్వీస్ నిలబెట్టుకుని 2-0తో ఆధిక్యం సాధించింది. ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకున్న సెరెనా… విజయానికి ఒక గేమ్ దూరంలో నిలిచింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో 15-0తో ఆధిక్యంలోకి వెళ్లడంతో వోజ్నియాకి మరింత ఒత్తిడిలో పడిపోయింది. ఆ తర్వాత ఆడిన ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 26 షాట్లు సాగిన ఆ ర్యాలీ చివరికి సెరెనా వైపు మొగ్గు చూపింది. తర్వాత స్కోరు 40-15 వద్ద ఉన్నప్పుడు సెరెనా అద్భుతమైన ఫోర్‌హ్యాండ్ షాట్‌తో వోజ్నియాకి సర్వీస్ బ్రేక్ చేసి సెట్‌తో పాటు మ్యాచ్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది.
సెరెనాకు ’18’ బ్రేస్‌లెట్: రికార్డు స్థాయిలో కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి తమ రికార్డు సమం చేసిన సెరెనా విలియమ్స్‌ను క్రిస్ ఎవర్ట్, మార్టినా నవ్రతిలోవాలు అభినందించి సత్కరించారు. ఎవర్ట్, నవ్రతిలోవా ’18’ అనే అంకె ఉన్న బ్రేస్‌లెట్‌ను సెరెనాకు బహూకరించారు.

బ్రయన్ సోదరులు జీ 100: అమెరికా కవల సోదరులు బాబ్, మైక్ బ్రయన్‌లు యుఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. పైనల్లో బ్రయన్ సోదరులు 6-3, 6-4తో మార్సెల్ గ్రానొలర్స్-మార్క్ లోపెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించారు. కెరీర్‌లో బ్రయన్ సోదరులలకు ఇది 100వ ఏటీపీ ప్రపంచ టూర్ టైటిల్. మొత్తం మీద 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఐదో యుఎస్ ఓపెన్ టైటిల్.

”క్రిస్ ఎవర్ట్, నవ్రతిలోవా లాంటి దిగ్గజాల సరసన చేరతానని ఎప్పుడూ అనుకోలేదు. స్నేహితురాలు వోజ్నియాకి ఓడినా ఆమె ఈ దశకు వచ్చినందుకు అభినందనలు. కచ్చితంగా ఆమె త్వరలోనే గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుస్తుంది’                                                                                                                                                                                                                                                                                సరెనా విలియమ్స్

Leave a Comment