ఒక్క షకీరా.. పది కోట్ల ఫేస్బుక్ లైక్లు

81405760197_625x300లాస్ ఏంజెలిస్ : మొన్నటికి మొన్న వాకా వాకా.. నిన్న సాకర్ సంబరాల్లో లా.. లా.. లా.. అంటూ పాటలు పాడి అన్ని దేశాల ప్రేక్షకులను ఉర్రూతలూగించిన షకీరా గుర్తుంది కదూ. మీకే కాదు.. ప్రపంచంలో ఆమెను చాలా చాలామంది గుర్తుపెట్టుకున్నారు. అందుకే, ఆమె కోసం ఫేస్బుక్లో గాలించి గాలించి మరీ ఆమె పేజీకి లైకుల మీద లైకులు కొట్టారు. అలా కొట్టిన లైకులు ఎన్నో తెలుసా.. ఏకంగా పది కోట్లు!! ఫేస్బుక్లో ఇన్ని లైకులు సాధించిన మొట్టమొదటి సెలబ్రిటీగా షకీరా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని పీపుల్ పత్రిక తెలిపింది.

ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, తనలాంటి కళాకారులు ఎదగడానికి, అలాగే ప్రేక్షకులకు బాగా దగ్గర కావడానికి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోందని షకీరా చెప్పింది. ఆమె సాధించిన ఈ విజయానికి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్బెర్గ్ కూడా అభినందించాడు. అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన విజయం సాధించిందని జుకెర్బెర్గ్ అన్నాడు. ఇన్ని కోట్ల మంది తనను మెచ్చుకున్నందుకు గాను తన అభిమానులందరికీ షకీరా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది.

Leave a Comment