షరపోవాకు షాక్

Caroline-Wozniacki-Cool-Pictureయుఎస్ ఓపెన్‌లో మరో సంచలనం! షరపోవా కథ ముగిసింది. ఐదో సీడ్ రష్యా భామకు చెక్ పెడుతూ పదో సీడ్ వోజ్నియాకి మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్‌కు కూడా ఎదురులేకుండా పోయింది. పురుషుల విభాగంలో రెండో సీడ్ ఫెదరర్ నాలుగో రౌండ్లో అడుగుపెట్టాడు.
న్యూయార్క్: మహిళల సింగిల్స్‌లో సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. టాప్-8లో ఇక మిగిలింది ఇద్దరే. రెండో సీడ్ హలెప్, మూడో సీడ్ క్విటోవా తదితరులు ఇంటిముఖం పట్టగా.. టాప్ సీడ్ సెరెనా, ఏడో సీడ్ బౌచర్డ్ మాత్రమే రేసులో ఉన్నారు. చక్కని ఫామ్‌లో ఉన్న వోజ్నియాకి (డెన్మార్క్) రెండున్నర గంటలపాటు సాగిన ప్రిక్వార్టర్‌ఫైనల్లో 6-4, 2-6, 6-2తో మరియా షరపోవా (రష్యా)పై విజయం సాధించింది. షరపోవా 43 అనవసర తప్పిదాలు, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరో ప్రిక్వార్టర్స్‌లో సెరెనా (అమెరికా) 6-3, 6-3తో కనెపి (ఎస్తోనియా)ను చిత్తు చేసింది. బెన్సిచ్ (స్విట్జర్లాండ్), పెంగ్ (చైనా) కూడా క్వార్టర్‌ఫైనల్స్‌లో ప్రవేశించారు. అన్‌సీడెడ్ బెన్సిచ్ 7-6 (8-6), 6-3తో 9వ సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా)కు షాకివ్వగా.. పెంగ్ 6-3, 6-4తో 14వ సీడ్ సఫరోవా (చెక్)ను మట్టికరిపించింది. మరో ప్రిక్వార్టర్స్‌లో పెనెటా (ఇటలీ) 7-5, 6-2తో డలెక్వా (ఆస్ట్రేలియా)పై నెగ్గింది.                                                                                                                                                                                                                                                                                         images  ఫదరర్ తొలి సెట్ ఓడినా..: పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ (స్విట్జర్లాండ్) దూసుకుపోతున్నాడు. మూడో రౌండ్లో తొలి సెట్‌ను కోల్పోయిన అతడు.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఫెదరర్ 4-6, 6-1, 6-1, 6-1తో స్పెయిన్ ఆటగాడు మార్సెల్ గ్రానోలర్స్‌ను చిత్తు చేశాడు. ఫెదరర్ 13 ఏస్‌లు సంధించాడు. క్వార్టర్స్‌లో చోటు కోసం అతడు అగట్‌తో తలపడతాడు. మూడో రౌండ్లో అగట్ 7-5, 6-2, 6-3తో మన్నారినో (ఫ్రాన్స్)ను ఓడించాడు. ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్), దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. బెర్డిచ్ 6-3, 6-2, 6-4తో గబష్విలి (రష్యా)పై నెగ్గగా.. దిమిత్రోవ్ 0-6, 6-3, 6-4, 6-1తో గొఫిన్ (బెల్జియం) పోరాటానికి తెరదించాడు. ఇతర మ్యాచ్‌ల్లో మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 6-4, 6-2, 6-2తో గాస్క్వెట్ (ఫ్రాన్స్)పై, సిలిక్ (క్రొయేషియా) 6-3, 3-6, 6-3, 6-4తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, ఫెల్సియానో లోపెజ్ 6-4, 6-2, 6-3తో థీమ్ (ఆస్ట్రియా)పై గెలిచారు.
మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో బోపన్న జంట: రోహన్ బోపన్న, స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంట మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో ఈ జంట 6-3, 6-4తో అనాబెల్ మెదినా (స్పెయిన్), రవెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడీపై నెగ్గింది.