ఢిల్లీలో బిజెపికి షీలా దీక్షిత్ బాసట

images (1)న్యూఢిల్లీ: ఢిల్లీలో బిజెపికి అనుకోని వైపు నుంచి మద్దతు లభించింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని బిజెపికి ఇవ్వాలని, అది ప్రజలకు మంచిదని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. కాంగ్రెసు సీనియర్ నేత అయిన షీలా దీక్షిత్ మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇటీవల కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి శాసనసభ్యులకు ఎర వేస్తోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న షీలా దీక్షిత్ బిజెపికి అనుకూలంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఏ ఎమ్మెల్యే కూడా ఢిల్లీలో ఎన్నికలను కోరుకోవడం లేదని ఆమె అన్నారు. కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఎవరు కూడా ఎన్నికలను కోరుకోవడం లేదని ఆమె అన్నారు. ప్రజలు శాసనసభ్యులు ఇటీవలే ఎన్నుకున్నారని, వారు ఎన్నికై ఏడాది కూడా కాలేదని, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తనకు అర్థమవుతోందని ఆమె అన్నారు. అయితే, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందనేది తనకు తెలియదని షీలా దీక్షిత్ అన్నారు. ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందనేది వేచి చూడాల్సిందేనని, అయితే మైనారిటీ ప్రభుత్వానికి సవాళ్లు ఎదురువుతాయని, దాన్ని బిజెపి అధిగమిస్తుందా లేదా అనేది వారికే తెలియాలని ఆమె అన్నారు. అయితే, షీలా దీక్షత్ వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ వెంటనే ఖండించింది. అవి షీలా దీక్షిత్ వ్యక్తిగత అభిప్రాయాలని, షీలా దీక్షిత్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెసు స్పష్టం చేసింది. షీలా దీక్షిత్ ప్రకటనకు తాము ఆశ్చర్యపోయామని కాంగ్రెసు అధికార ప్రతినిధి ముకేష్ శర్మ అన్నారు.

Leave a Comment