శ్రీలంకదే తొలి టెస్టు

61407704998_625x300చెలరేగిన హెరాత్
– రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన పాక్
– ఏడు వికెట్లతో శ్రీలంక గెలుపు

గాలె: ‘డ్రా’ ఖాయమనుకున్న మ్యాచ్‌ను శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ తన స్పిన్ మాయాజాలంతో మలుపు తిప్పాడు. ఊహించని విధంగా శ్రీలంకకు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. నిలకడలేని బ్యాటింగ్‌కు పర్యాయ పదంగా మారిన పాకిస్థాన్ మరోసారి కీలకదశలో చేతులెత్తేసి మూల్యం చెల్లించుకుంది. చివరిరోజు నాటకీయ పరిణామాల నేపథ్యంలో తొలి టెస్టులో శ్రీలంక అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రంగన హెరాత్ (6/48) సుడులు తిరిగే బంతులకు మిస్బా సేన చివరి రోజు ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 80.2 ఓవర్లలో180 పరుగులకే కుప్పకూలింది.

వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (70 బంతుల్లో 52; 5 ఫోర్లు), అజహర్ అలీ (151 బంతుల్లో 41; 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత 21 ఓవర్లలో 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక వేగంగా ఆడి 16.2 ఓవర్లలో 3 వికెట్లకు మ్యాచ్‌ను ముగించింది. వెంటనే భారీ వర్షం కురవడంతో లంక ఊపిరిపీల్చుకుంది. మేఘావృత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న కెప్టెన్ మాథ్యూస్ (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) చెలరేగాడు. జునైద్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అంతకుముందు 4/1 ఓవర్ నైట్ స్కోరుతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ తొలి సెషన్‌లోనే మూడు వికెట్లను కోల్పోయింది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మిస్బా (64 బంతుల్లో 28; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి అజర్ అలీ ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. ఈదశలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హెరాత్ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించాడు. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు గురువారం నుంచి కొలంబోలో ప్రారంభమవుతుంది.