హెరాత్ విజృంభణ

 51408132514_625x300పాక్ తొలి ఇన్నింగ్స్ 244/6  
– శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 320
కొలంబో: శ్రీలంక లెఫ్టార్మ్  స్పిన్నర్ రంగన హెరాత్ (5/98) ధాటికి పాకిస్థాన్ టాప్ ఆర్డర్ కకావికలమైంది. ఫలితంగా సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు శుక్రవారం మిస్బా సేన 70 ఓవర్లలో ఆరు వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (85 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా… చివర్లో వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (81 బంతుల్లో 66 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అసద్ షఫీఖ్ (90 బంతుల్లో 42; 2 ఫోర్లు), అజహర్ అలీ (77 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడారు.

హెరాత్ దెబ్బకు ఓ దశలో 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పాక్‌ను అసద్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు వీరు 93 పరుగులు జోడించారు. టాప్ ఆర్డర్‌లో వరుసగా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురిని పెవిలియన్‌కు పంపిన హెరాత్ తన టెస్టు కెరీర్‌లో 250 వికెట్ల మైలురాయిని దాటాడు. ఇది శ్రీలంక తరఫున మూడో అత్యుత్తమ రికార్డు. గతంలో మురళీధరన్ (800), వాస్ (355) ఉన్నారు. అంతకుముందు 261/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన లంక లంచ్ విరామానికి కొద్ది ముందు 99.3 ఓవర్లలో 320 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జునైద్ ఖాన్‌కు ఐదు, వహాబ్ రియాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి.