మా అమ్మాయిపై ఎందుకంత ఆసక్తి?

61405966665_625x300‘‘నా కూతురు తెరంగేట్రంపై అంత ఆసక్తి ఎందుకు’’ అంటూ నటి శ్రీదేవి రుసరుసలాడుతున్నారు. నిజంగానే ఆలూ లేదు చూలూ లేదు అబ్బాయి పేరు సోమలింగం అన్న చందాన అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి సినీ రంగ ప్రవేశం గురించి చాలా కాలం నుంచి చాలానే ప్రచారం జరుగుతోంది. అదిగో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇదిగో కోలీవుడ్ కొస్తున్నారు. లేదు లేదు తొలుత బాలీవుడ్‌లోనే రంగ ప్రవేశం చేయనున్నారంటూ సత్య దూర ప్రచారం హోరెత్తుతోంది.
 
 ఇలాంటి అసత్య ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా నటి శ్రీదేవి ప్రకటించారు. తన కుమార్తె చదువుకుంటోందని, తన సినీ రంగ ప్రవేశం ఇప్పట్లో ఉండదంటూ స్పష్టం చేశారు. తన కూతురు సినీ తెరంగేట్రం గురించి ఎందుకంత ఆసక్తి చూపుతున్నారో అర్థం కావడం లేదు అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత బహుశా ఆమె తల్లినయిన తాను సినిమా రంగంలో ఉండటం వల్లనేమోనంటూ తనకు తానే సమాధానం ఇచ్చుకున్నారు.
 
 ఇంకా శ్రీదేవి మాట్లాడుతూ మరెందుకు సినిమా కార్యక్రమాలకు కూతుళ్లను వెంటేసుకొస్తున్నారని అడుగుతున్నారు. 15 ఏళ్ల తరువాత మళ్లీ తాను నటిస్తున్నానని తన సినీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఆసక్తి తన కూతుళ్లకు ఉండదా? అంటూ ప్రశ్నించారు. అలాగని తన కూతుళ్ల రంగ ప్రవేశానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమా? అన్నారు. తాను తన కూతుళ్లను హీరోయిన్‌గా పరిచయం చెయ్యదలిస్తే ఇలాంటి కార్యక్రమాలకు తీసుకు రానవసరం లేదన్నారు. ఇంట్లో కూర్చోబెట్టే హీరోయిన్లను చేయగలనని శ్రీదేవి ఆవేశపూరితంగా పేర్కొన్నారు.

Leave a Comment