ఎక్కడున్నారు నాయనా … రండి

61405513457_625x300అధిష్టానంతో పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం… ఇంకే ముంది ఎన్నికల్లో తమకే లాభం చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గాలి తీసిన బెలూన్లా తయారైంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపోంది అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ పార్టీ ప్రారంభించిన ఆకర్ష్కు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలు క్యూ కట్టారు. అందులోభాగంగా హస్తానికి చెందిన పలువురు ఎమ్మెల్సీలు చకచక కారు ఎక్కేశారు.

రేపోమాపో మరికొంత మంది నాయకులతోపాటు కార్యకర్తలు కారు ఎక్కేందుకు రెడీ అయ్యారు. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీలంతా కారు ఎక్కేస్తారని ఆ పార్టీ రాష్ట్ర  నాయకత్వం భావించింది. అంతే …వెంటనే రంగంలోకి దిగి ఆ పార్టీ అగ్ర నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత డీఎస్ హస్తినకు పయనమైయ్యారు.

పార్టీ అధినేత్రితో భేటీ అయి ‘కారు’ చేసే మ్యాజిక్లను అవిడ ఎదుట ఏకరువు పెట్టారు. దాంతో కారు జోరు తగ్గించడానికి వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. పార్టీ పరాజయంతో చెల్లాచెదురైన క్యాడర్ను ఏక తాటిపైకి తీసుకువచ్చేందుకు యుద్ద ప్రాతిపదికపైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతే డీఎస్ రంగంలోకి దిగారు. అందులోభాగంగా నాయనా ఎక్కడ ఉన్నారు… మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా… మీ సమస్యలు నా సమస్యలుగా భావిస్తానంటూ బుధవారం డీఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. చెల్లాచెదురైన కేడర్ మళ్లీ ఒక తాటిపైకి వస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.

Leave a Comment