ఎంసెట్‌పై నేడే సుప్రీంకోర్టు తుది తీర్పు

  • 41407143978_625x300 ఎంసెట్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  •  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం
  •  వాదనలతో సిద్ధమైన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు
  •  మరింత గడువుకోరనున్న తెలంగాణ సర్కారు
 సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ అడ్మిషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.  ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలు రెండూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎంసెట్ అడ్మిషన్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వాదనను ఈ నెల 4న సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ.. ఆగస్టు 31 లోగా అడ్మిషన్లను పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.
కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సుప్రీం తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. తమ రాష్ట్రంలోని పరిస్థితులను వినిపించేందుకు తెలంగాణ విద్యా, న్యాయ శాఖల ఉన్నతాధికారులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో పాలనాపరమైన సమస్యలు, అధికారుల కొరత ఉన్నందునే గడువు కోరినట్లు మళ్లీ తెలియచేయనున్నారు. విద్యార్థుల ప్రవేశాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముడిపడి ఉన్నందున వాటి చెల్లింపుకు తాము కొత్త పథకాన్ని (తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం-ఫాస్ట్) ప్రవేశపెడుతున్నామని, దానికి మార్గదర్శకాలు ఖరారు చేయాల్సి ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తెలంగాణ సర్కారు తేనుంది. మార్గదర్శకాలు ఖరారయ్యాక తాము ప్రవేశాలను చేపట్టి పూర్తి చేస్తామని తెలపనుంది. తమకు మరింత సమయం కావాలని కోరనుంది. నాలుగో తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని, హెల్ప్‌లైన్ కేంద్రాలను నిర్వహించే సిబ్బందితోనూ చర్చిస్తున్నామని చెప్పనుంది.
మరోవైపు ప్రవేశాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కూడా తాము చేపట్టిన చర్యలను కోర్టుకు వివరించనున్నాయి. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా నాలుగు రోజులుగా ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టుఏపీ ఉన్నత విద్యా మండలి కోర్టుకు నివేదించనుంది. నిర్దేశిత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయనుంది. ఉన్నత విద్యావకాశాల్లో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులుంటాయని విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వం కూడా తేనుంది.
ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య అడ్మిషన్లలో ఆంధ్రప్రదేశ్‌కు సమాన అవకాశాలు కల్పించారని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి ప్రకటించిన షెడ్యూలు మేరకు అడ్మిషన్లను పూర్తయ్యేలా చూడాలని విన్నవించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏపీ అభిప్రాయాన్ని కోరిన పక్షంలో రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులు, అప్పులు ఇతర అనేక అంశాల్లో ఇరు రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ జరిపారో వాటిని కూడా అదే ప్రాతిపదికన చెల్లించడానికి తాము సిద్ధమని, ఇప్పటికే ఆ మేరకు ప్రకటించామని తెలియజేయనుంది. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కూడా తన వాదనలు వినిపించనుంది.