దొంగ చాటుగా బైక్ నడిపేదాన్ని!


tapsi-driving-bike-secretaly ‘‘అమ్మానాన్నలకు నచ్చకపోయినా… మనకు నచ్చినవి మనం దొంగచాటుగా అయినా చేసేస్తుంటాం. అయితే… ఒక్కోసారి అవే జీవితంలో ఉపయోగపడుతుంటాయి’’ అంటూ చిన్నతనంలోని తన బైక్ రైడింగ్ సంఘటనని గుర్తు చేసుకున్నారు కథానాయిక తాప్సీ. ‘‘నాకు బైక్ నడపడం మహా సరదా. చిన్నప్పుడే ధైర్యంగా బైక్ నడిపేసేదాన్ని. కానీ అమ్మానాన్నలకు మాత్రం నేను బైక్ నడపడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. పడిపోతానేమో అని వారి భయం. అందుకే బైక్ జోలికెళ్తే చాలు… చీవాట్లు పెట్టేసేవారు. అయినా సరే.. నా అలవాటు మాత్రం వదులుకోలేదు.

 
 దొంగచాటుగా నైనా బైక్ నడిపేసేదాన్ని. ఎప్పుడైనా పొరపాటున బైక్ నడుపుతూ అమ్మానాన్నల కంట పడ్డాననుకోండీ…వాళ్లు కొట్టక ముందే ఏడ్చేసేదాన్ని’’ అంటూ గత స్మృతుల్ని తాప్సీ నెమరువేసుకున్నారు. ఆమె ఇంకా చెబుతూ -‘‘అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా… ఇష్టంతో నేను బైక్ నేర్చుకోవడం నాకు ఇప్పటికి అక్కరకొచ్చింది. హిందీలో నేను చేసిన ‘చష్మే బద్దూర్’, ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రాల్లో పాత్రల పరంగా నేను బైక్ నడపాలి. చిన్నప్పుడే నేర్చుకుని ఉండటం వల్ల ఈజీగా నడిపేశా. సెట్‌లో నా స్పీడ్ చూసి యూనిట్ మొత్తం భయపడిపోయేవారు. కానీ బైక్ నడుపుతుంటే నాకు మాత్రం ఏదో తెలీని దర్పం’’ అంటూ తనదైన శైలిలో అందంగా నవ్వేశారు తాప్సీ.

Leave a Comment