నేతాజీ, అటల్‌జీలకు భారతరత్న!

41407699202_625x300మాలవీయ, కాన్షీరామ్, ధ్యాన్‌చంద్‌ల పేర్లూ పరిశీలనలో?
పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని ప్రకటించే అవకాశముందని ప్రచారం
ఇప్పటికే ఐదు మెడల్స్ తయారీకి కేంద్రం ఆదేశం

 
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితోపాటు దేశ స్వాతంత్య్ర సంగ్రామయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లను కేంద్రం ఈ ఏడాది ‘భారతరత్నాలు’గా ప్రకటించనుందా? వీరితోపాటు మరికొందరు దిగ్గజాలను కూడా దేశ అత్యున్నత పౌరపురస్కారాలతో సత్కరించనుందా? ఢిల్లీలో జోరుగా సాగుతున్న ప్రచారం చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్రంలో 1999-2004 మధ్య బీజేపీ సారథ్యంలో తొలి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాజ్‌పేయిని, స్వాతంత్య్రోద్యమంలో తనదైన పాత్రను పోషించిన సుభాష్‌ను మోడీ సర్కారు భారతరత్నతో సత్కరించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరితోపాటు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయ, దళిత నాయకుడు, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు కాన్షీరామ్, హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ల పేర్లూ కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంశాఖ నాలుగు రోజుల కిందట ఐదు భారతరత్న మెడల్స్ తయారు చేయాలని టంకశాల(మింట్)ను ఆదేశించడం ఊహాగానాలకు ఊతమిచ్చింది. దీనిపై ప్రధాని మోడీ నిర్ణయం తీసుకొని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రచారంపై హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఐదు మెడల్స్ తయారీకి ఆదేశించిన మాట వాస్తవమేనని…కానీ అంతమాత్రాన ఐదుగురికి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారని అర్థం కాదని అన్నారు. మెడల్స్‌ను తగు సంఖ్యలో అట్టిపెట్టుకునేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికే ఈ అవార్డును అందించాలన్న నిబంధన ఉందని గుర్తుచేశారు. భారతరత్న కోసం ప్రధానే స్వయంగా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. లాంఛనంగా ఇంకెవరి సిఫార్సూ అక్కర్లేదు. వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2008 జనవరిలో బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ నాటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ కూడా రాశారు. ఈ పురస్కారానికి వాజ్‌పేయి, కాన్షీరామ్‌ల పేర్లను పరిశీలించకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయంటూ మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ , ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావులు 2013కుగానూ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతరత్న అందుకోవడం తెలిసిందే.

భారతరత్న అక్కర్లేదు: నేతాజీ బంధువులు

కేంద్రం సుభాష్‌కు భారతరత్న ప్రకటించాల్సిన అవసరంలేదని ఆయన సమీప బంధువు చంద్రకుమార్ బోస్ అన్నారు. బోస్‌కు ఈ పురస్కారాన్ని తమ 60మంది బంధువులు వ్యతిరేకిస్తున్నారన్నారు. దీనికి బదులు 1945లో ఆయన అదృశ్యం వెనకున్న మిస్టరీని ప్రభుత్వం నిగ్గుతేల్చాలని కోరారు. ‘మరణానంతరం బోస్‌కు ఈ పురస్కారం ఇస్తుంటే ఆయనెప్పుడు చనిపోయా రో తెలపాలి’ అని అన్నారు. బోస్‌కు భారతరత్న ప్రకటించినా అందుకోబోమన్నారు.