బోధన ఒక వృత్తి కాదు..అదొక జీవన ధర్మం:నరేంద్రమోడీ

61409863205_625x300జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులతో మోడీ ముచ్చట్లు

న్యూఢిల్లీ:
 విద్యా బోధన అనేది ఒక వృత్తి కాదని.. ఒక జీవన ధర్మమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. ఉపాధ్యాయులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను అవగతం చేసుకుని.. కొత్త తరాన్ని అందుకు అనుగుణంగా సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి జాతీయ అవార్డులు అందుకోనున్న 350 మంది ఉపాధ్యాయులను ప్రధాని గురువారం కలిసి మాట్లాడారు. ‘‘ఒక సమాజం ప్రగతి సాధించాలంటే ఉపాధ్యాయులు కాలం కన్నా ఎల్లప్పుడూ రెండడుగులు ముందు ఉండాలి.
 
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను అవగతం చేసుకుని.. కొత్త తరంలో ఆసక్తిని రేకెత్తించటం ద్వారా వారిని తగినవిధంగా సిద్ధం చేయాలి’’ అని ఆయన ఈ సందర్భంగా వారితో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు కూడా విద్యాబోధనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. టీచర్స్‌డే సందర్భంగా ప్రధాని శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులను కలవనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో వీక్షించేందుకు దేశమంతటా పాఠశాలల్లో విద్యార్థులను సమావేశపరచాలని సూచించారు.

Leave a Comment